ఉక్రెయిన్ కు షాక్.. మిలటరీ, రక్షణ సహా అన్నీ బంద్ చేసిన అమెరికా!
అమెరికాకు వచ్చి.. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే వాగ్వాదం పెట్టుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలింది.
By: Tupaki Desk | 4 March 2025 9:57 AM ISTఅమెరికాకు వచ్చి.. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే వాగ్వాదం పెట్టుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలింది. తమ మాట వినని జెలెన్ స్కీకి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు ట్రంప్. రష్యాతో యుద్ధం ముగించి శాంతి స్థాపన చేయాలన్న ట్రంప్ మాటను పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు యుద్ధం వేళ ఉక్రెయిన్ ను చావుదెబ్బ తీశాడు ట్రంప్.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు.. దీనిపై ఏదో ఒకటి నిర్ణయించేంత వరకూ ఉక్రెయిన్ కు అమెరికా అందించే అన్ని సహాయాలను అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేసిన్నట్టు యుఎస్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఫాక్స్ న్యూస్‌లో ఈ మేరకు ఓ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఆదేశం త్వరలోనే అమలులోకి రానుందని తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సాయంత్రం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలకు తన ప్రసంగంలో ఉక్రెయిన్ అంశంపై మాట్లాడనున్నారు. ఇదే రోజు కెనడా , మెక్సికో నుండి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 20 శాతం టారిఫ్ పెంపు అమలులోకి రానుంది.
వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ తో మళ్లీ చర్చలు ప్రారంభిస్తారన్న అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ “అమెరికా ఉక్రెయిన్ కు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని మరింత అభినందించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటే చర్చలు కొనసాగుతాయన్నారు. లండన్‌లో జెలెన్స్కీ యుద్ధం ఇంకా చాలా కాలం కొనసాగవచ్చని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రష్యా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోందని, అలాగే ఉక్రెయిన్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. ఇది జెలెన్స్కీకి అతని వర్గానికి ఇష్టం లేదని ట్రంప్ అన్నారు.
కొన్ని వారాల క్రితం, ట్రంప్ ఏకంగా జెలెన్స్కీని "డిక్టేటర్" అని విమర్శించారు. అలాగే ఎన్నికల గురించి ఆలోచించకపోవడానికి కారణం అతను ఓడిపోతానని భయపడటమే అని సూచించారు.
శుక్రవారం ఓవల్ కార్యాలయంలో జరిగిన గట్టి వాదనల తర్వాత, ఉక్రెయిన్ కు మద్దతు తెలిపే ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహామ్ ఏకంగా జెలెన్స్కీ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. దీనికి జెలెన్స్కీ స్పందిస్తూ "నేను ఉక్రెయిన్ ప్రజలకే మాత్రమే సమాధానం చెప్పాలి" అని అన్నారు. అంతేకాకుండా గ్రాహామ్‌కి యుక్రైన్ పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తూ "అక్కడి ఎన్నికల్లో ఓటు వేయడానికి మీకు అవకాశం ఉంటే, నన్ను తొలగించడానికి ప్రయత్నించండి" అని వ్యంగ్యంగా చెప్పారు.
దీంతో జెలెన్ స్కీ ఇక తగ్గేలా కనిపించడం లేదని భావించిన ట్రంప్ ఆ దేశానికి అన్ని రకాల సహాయాలను నిలిపివేస్తూ షాకిచ్చారు. మరి యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు అండగా ఉంటాయా? రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందా? ఉక్రెయిన్ ఇప్పుడు ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది.