Begin typing your search above and press return to search.

కెనడా-మెక్సికోపై ట్రంప్ ట్యాక్స్.. ఇక ఈ వస్తువులపై పన్ను బాదుడు

ఇక చుట్టుపక్కల దేశాలైన కెనడా, మెక్సికోలపై ట్యాక్స్ కొరడా ఝళిపించారు ట్రంప్. మెక్సికో ద్వారా చైనా వస్తువులు తమ దేశంలోకి వస్తున్నాయనేది ఆయన ఆరోపణ.

By:  Tupaki Desk   |   21 Jan 2025 12:30 PM GMT
కెనడా-మెక్సికోపై ట్రంప్ ట్యాక్స్.. ఇక ఈ వస్తువులపై పన్ను బాదుడు
X

బహుశా ఉత్తర అమెరికా అనే పెద్ద ఖండంలో ఉన్నవే నాలుగైదు దేశాలు. అందరికీ తెలిసినవి అమెరికా, కెనడా, మెక్సికో. ఇవే అమెరికాకు ఇరుగు-పొరుగు. ఇప్పటివరకు పెద్దన్నలాగా వ్యవహరించిన అమెరికా కెనడా, మెక్సికోతో ఇచ్చిపుచ్చుకుంది. ఇక మీదట మాత్రం అదేమీ చెల్లదు.

ట్రంప్ వస్తూనే తమ ఇరుగుపొరుగును టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేయాలని.. మెక్సికోతో సరిహద్దుల్లో గోడ కట్టేయాలని వ్యాఖ్యానించారు. కాస్త ముందుకెళ్లి పనామా కాల్వను స్వాధీనం చేసుకుంటామని.. గ్రీన్ ల్యాండ్ ను అమ్మేయాలని డిమాండ్ చేశారు.

ఇక చుట్టుపక్కల దేశాలైన కెనడా, మెక్సికోలపై ట్యాక్స్ కొరడా ఝళిపించారు ట్రంప్. మెక్సికో ద్వారా చైనా వస్తువులు తమ దేశంలోకి వస్తున్నాయనేది ఆయన ఆరోపణ. కెనడా అక్రమ వలస దారులకు కేంద్రంగా మారిందనేది ఉద్దేశం. దీంతో ఈ రెండింటినీ టార్గెట్ చేశారు. సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండు దేశాల దిగుమతులపై 25 శాతం సుంకం విధించారు. తద్వారా ఇరు దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. అక్రమ వలసలు, డ్రగ్స్ కట్టడికి ట్రంప్ పెద్ద ప్లాన్ లో ఉన్నారు.

128.51 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ ఇంధనాలు, నూనెలను అమెరికాకు కెనడా సరఫరా చేస్తోంది. 58.21 బిలియన్ డాలర్లు రైల్వే మినహా ఇతర వాహనాలు, 33.75 బిలియన్ డాలర్ల విలువైన యంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు, 14.05 బిలియన్ డాలర్ల ప్లాస్టిక్స్, 12.43 బిలియన్ డాలర్ల ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు, 11.87 బిలియన్ డాలర్ల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, 11.53 బిలియన్ డాలర్ల కలప, చెక్క వస్తువులు, 11.36 బిలియన్ డాలర్ల అల్యూమినియం, 8.51 బిలియన్ డాలర్ల ఇనుము, ఉక్కు, 7.58 బిలియన్ డాలర్ల ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పరికరాలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.

మెక్సికో నుంచి 130.03 బిలియన్ డాలర్ల విలువైన వాహనాలు, 85.55 బిలియన్ డాలర్ల విద్యుత్ యంత్రాలు, 81.61 బిలియన్ డాలర్ల న్యూక్లియర్ రియాక్టర్లు, 25.02 బిలియన్ డాలర్ల ఖనిజ ఇంధనాలు, నూనెలు, 22.33 బిలియన్ డాలర్ల ఆప్టికల్, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు, 13.35 బిలియన్ డాలర్ల ఫర్నిచర్, పరుపులు, 11.75 బిలియన్ డాలర్ల పానీయాలు, స్పిరిట్స్, వెనిగర్, 10.26 బిలియన్ డాలర్ల ప్లాస్టిక్స్. 8.82 బిలియన్ డాలర్ల కూరగాయలు, దుంపలు ఎగుమతి అవుతున్నాయి.

25 శాతం అధిక సుంకాలతో.. అమెరికాకు వస్తువులను సరఫరా చేస్తున్న ఇతర మిత్ర దేశాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. కాగా, ట్రంప్ తో కెనడా, మెక్సికో చర్చలకు ప్రతిపాదించాయి. ఆయన వెనక్కుతగ్గే సూచనలు మాత్రం లేవు.