Begin typing your search above and press return to search.

పది లక్షల ప్రాణాలు ట్రంప్ మూడ్ మీద ఆధారపడ్డాయి!

ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలకు నిధుల్ని కట్ చేసిన ఆయన.. వ్యాక్సిన్ కూటమికి కూడా నిధులు ఆపేస్తే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది.

By:  Tupaki Desk   |   28 March 2025 4:54 AM
పది లక్షల ప్రాణాలు ట్రంప్ మూడ్ మీద ఆధారపడ్డాయి!
X

అగ్రరాజ్యమని ఊరికే అనరు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ.. తన అవసరాలు.. తన అధిక్యతను ప్రదర్శించటంతో పాటు ప్రపంచ దేశాలకు అవసరమైన కొన్ని కార్యక్రమాల్ని చేపట్టే అలవాటు అమెరికాకు ఉంటుంది. రెండోసారి అమెరికా అధ్యక్ష కుర్చీలో కూర్చున్న ట్రంప్ మాత్రం.. అమెరికాకు ప్రయోజనం కలిగించటం మినహా మరేమీ తనకు ముఖ్యం కాదన్న వాదనను వినిపిస్తూ అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆగమాగం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలకు నిధుల్ని కట్ చేసిన ఆయన.. వ్యాక్సిన్ కూటమికి కూడా నిధులు ఆపేస్తే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది.

అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమిని ‘గావి’ అని వ్యవహరిస్తారు. దీనికి అగ్రరాజ్యం దండిగా నిధులు ఇస్తూ ఉంటుంది. దగ్గర దగ్గర 300 మిలియన్ డాలర్ల వరకు సాయం చేస్తూ ఉంటుంది. ఈ నిధులతో 120 దేశాల్లో వివిధ కార్యక్రమాల్ని.. వ్యాక్సిన్లను అందజేస్తుంటారు. అయితే.. ఇలాంటి సాయాలకు చెక్ పెడతానని.. ఉత్తపుణ్యానికి విదేశాలకు ఎందుకు సాయం చేయాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు ట్రంప్.

గావికి నిధులు ఇచ్చే విషయంపై ఇప్పటివరకు ట్రంప్ సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ.. ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుకు తగ్గట్లే.. గావి విషయంలోనూ వ్యవహరిస్తే పది లక్షల ప్రాణాలు పోవటం ఖాయమన్న మాట చెబుతున్నారు. గావికి అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై వినాశకర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మానవతా ద్రక్పథంతో సాయం చేయటానికి ఏరపాటు చేసిన యూఎస్ ఎయిడ్ సంస్థను మూసేస్తున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. అంతేకాదు.. దాదాపు 5 వేలకు పైగా ప్రోగ్రాంలను రద్దు చేస్తున్నట్లుగా అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించారు. విదేశాంగ శాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇస్తామని.. మిగిలిన వాటికి నిధుల పంపిణీ నిలిపివేస్తామని తేల్చేశారు. దీనికి సంబంధించి ఇటీవల లీకైన 281 పేజీల ఫైల్ లో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి ‘గావి’ పేరు కూడా ఉండటం తాజా ఆందోళనకు కారణంగా చెబుతున్నారు.

ఒకవేళ గావికి అందించే ఆర్థిక సాయం నిలిపివేస్తే..నిర్మూలించే అవకాశం ఉన్న వ్యాధులతో దాదాపు 10 లక్షల మరణాలు సంభవించొచ్చని.. ప్రపమాదకర వ్యాధుల వ్యాప్తి అనేక జీవితాల మీద పడుతుందని గావి ఎగ్జిక్యూటివ్ సానియా నిష్టర్ చెబుతున్నారు. అయితే.. నిధులు నిలిపివేస్తున్నట్లుగా అమెరికా నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. ఈ ఏడాది అమెరికా పార్లమెంట్ ఆమోదించిన 300 మిలియన్ డాలర్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న గావి విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ట్రంప్ మూడ్ మీద 10 లక్షల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని చెప్పకతప్పదు.