Begin typing your search above and press return to search.

దేశం ఏదైనా ఎలక్షన్ స్టంట్స్ ఇలానే ఉంటాయా?... ట్రంప్ వీడియో వైరల్!

సాధారణంగా మనదేశంలో ఎన్నికల సమయంలో నేతలు చేసే రకరకాల ఎలక్షన్ స్టంట్స్ ని చూస్తుంటామన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Oct 2024 3:53 AM GMT
దేశం ఏదైనా ఎలక్షన్  స్టంట్స్  ఇలానే ఉంటాయా?... ట్రంప్  వీడియో వైరల్!
X

సాధారణంగా మనదేశంలో ఎన్నికల సమయంలో నేతలు చేసే రకరకాల ఎలక్షన్ స్టంట్స్ ని చూస్తుంటామన్న సంగతి తెలిసిందే. కాకా హోటల్స్ వద్ద దోసలు వేయడం, బండి వద్ద బట్టలు ఇస్త్రీ చేయడం.. చంటి పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దాడటం.. అవ్వాతాతలను అక్కున చేర్చుకోవడం.. ఒకటా.. రెండా.. ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.

అయితే... ఈ సందడి కేవలం భారత్ లోనే కాదు.. ఎన్నికల సమయం వచ్చిందంటే.. అగ్రరాజ్యంలో అయినా నేతల ఫీట్లు ఇలానే ఉంటాయి అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. వచ్చే నెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇలాంటి స్టంట్స్ చేశారు. ఇందులో భాగంగా మెక్ డొనాల్డ్ లో పనిచేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వయసుని వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అస్త్రంగా మలచుకొంటూ, ఆయన్ను ఇరకాటంలో పెట్టేం ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేస్తున్నారు.

ఈ క్రమంలోనే... అక్టోబర్ 20న హారిస్ 60వ బర్త్ డే చేసుకుంటుండగా.. ట్రంప్ మాత్రం తనదైన శైలిలో ఆమెపై విమర్శలు గుప్పించే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి తాన్ను యుక్తవయసులో ఉన్నప్పుడు మెక్ డొనాల్డ్ లో పనిచేసినట్లు గతంలో కమలా హారిస్ చేసిన వ్యాఖ్యలను తాజాగా డోనాల్డ్ ట్రంప్ గుర్తుచేస్తుకున్నారు.

ఈ నేపథ్యలోనే... తాను ఆమె మాటలు విశ్వసించను అని అంటూ.. ఆమె బర్త్ డే నాడు తాను రెస్టారెంట్లో పనిచేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే తాజాగా ఆయన మెక్ డొనాల్డ్ కిచెన్ లో ప్రత్యక్ష మయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తూ మెక్ డొనాల్డ్ లో ట్రంప్ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పెన్సిల్వేనియాలోని మెక్ డొనాల్డ్ లో కుక్ గా మారి ఫాస్ట్ ఫుడ్ చైన్ లో పనిచేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. "కమల కంటే 15 నిమిషాలు ఎక్కువ పనిచేశాను" అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. హారిస్ మధ్యతరగతి నేపథ్యంలో వాదనను సవాలు చేసే ప్రయత్నంలో ట్రంప్ ఈ పనికి పూనుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందితో సంభాషించడంతో పాటు ఫ్రైస్ చేయడం ఎలానో చూసి నేర్చుకుంటూ పనిచేశారు. ఇదే సమయంలో.. రెస్టారెంట్ డ్రైవ్-త్రూ వద్ద ప్రజలకు ఆహారాన్ని కూడా అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన వేళ... ఎలక్షన్ వచ్చిందంటే ఏ దేశం నేతలైనా ఇంతేనా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు భారతీయ నెటిజన్లు!