Begin typing your search above and press return to search.

బ్రిక్స్ దేశాలకు ట్రంప్ బెదిరింపులు మామూలుగా లేవు!

బెదిరించడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ బెదిరించలేరు, బ్లాక్ మెయిల్ చేయలేరు అన్నట్లుగా ట్రంప్ 2.0లో ఆయన వ్యవహారశైలి సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Feb 2025 7:36 AM GMT
బ్రిక్స్  దేశాలకు ట్రంప్  బెదిరింపులు మామూలుగా లేవు!
X

బెదిరించడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ బెదిరించలేరు, బ్లాక్ మెయిల్ చేయలేరు అన్నట్లుగా ట్రంప్ 2.0లో ఆయన వ్యవహారశైలి సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న కొలంబియా దేశస్థులను వారి స్వదేశానికి పంపిన సమయంలో ట్రంప్ బెదిరింపులు ఎలా ఉంటాయనేది తెలిసిందే.

తమ పౌరులను నేరస్థులుగా ట్రీట్ చేస్తూ పంపిన అమెరికా రక్షణ శాఖ విమానాలను కొలంబియా వెనక్కి పంపించేసింది. దీంతో.. ఆ దేశంపై సుంకలు 25శాతం పెంచుతున్నట్లు వైట్ హౌస్ నుంచి వార్తలు బయటకు వచ్చాయి. దీంతో.. కొలంబియా దిగిరాక తప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిక్స్ దేశాలను ట్రంప్ బెదిరించడం వైరల్ గా మారింది.

అవును... బ్రిక్స్ అనేది 10 దేశాలతో కూడిన అంతర్ ప్రభుత్వ సంస్థ అనే సంగతి తెలిసిందే. ఇందులో.. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దేశాలు డాలర్ తో ఆడాలనుకుంటే వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని ట్రంప్ అన్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి కొన్ని గంటల ముందు స్పందించిన ట్రంప్.. బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదన తీసుకొచ్చిందని.. డాలర్ తో ఆడుకోవాలనుకుంటే చర్యలు తప్పవనే తన హెచ్చరికతో వారు భయపడ్డారని అన్నారు.

ఇదే సమయంలో... తమకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని.. ఒక వేళ వారు అది చేయాలనుకుంటే.. టారిఫ్ లు విధించవద్దని తన దగ్గరకు వచ్చి వేడుకుంటారని.. తన బెదిరింపులతో బ్రిక్స్ అంతమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.

కాగా... గత ఏడాది అక్టోబర్ లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. డిజిటల్ కరెన్సీని వాడుకోవాలని ప్రతిపాదించారు.

ఇదే సమయంలో... బ్రిక్స్ సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే... డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.