మిత్రమా పుతిన్.. చర్చలకు రా.. లేకుంటే చర్యలే.. ట్రంప్ అల్టిమేటం
2021-2024 మధ్య తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేవాడిననేది డొనాల్డ్ ట్రంప్ తరచూ చెప్పే మాట.
By: Tupaki Desk | 22 Jan 2025 9:43 AM GMTసరిగ్గా 35 ఏళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మరొక్క నెల అయితే మూడేళ్లు పూర్తవుతాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి..? యుద్ధానికి కారణమైన.. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అనే ప్రతిపాదన కార్య రూపం దాల్చలేదు. రష్యా కూడా వారంలో యుద్ధం ముగించలేకపోయింది. ఇన్నాళ్లూ యుద్ధాన్ని ఎగదోస్తున్న అమెరికాలో అధికార మార్పు జరిగింది. ఇక ఏం జరగనుంది..?
2021-2024 మధ్య తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేవాడిననేది డొనాల్డ్ ట్రంప్ తరచూ చెప్పే మాట. అదే మాటను రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా చెప్పారు.
బాధ్యతలు స్వీకరించిన సోమవారమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల పరంపర కొనసాగించిన ట్రంప్.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కూడా మాట్లాడారు. అంతకుముందు తాను అధ్యక్షుడైతే వారంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించారు. ట్రంప్ ఇంకా అధికారంలోకి రాకముందే దానిని సాకారం చేశారు కూడా.
ఇప్పుడు రష్యాపై ఫోకస్ పెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో త్వరలో భేటీ అయ్యేందుకు సిద్ధం అని ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలుకుతానని మరోసారి చెప్పారు. యుద్ధం అనేది అసలు మొదలే కాకూడదని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందంపై పుతిన్ చర్చలకు రాకపోతే.. ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. కాగా, పుతిన్ తో తనకు చాలా బలమైన అవగాహన ఉందని.. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు ట్రంప్. తమ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై పుతిన్ కు గౌరవం లేదన్నారు. తాను మాత్రం పుతిన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కాగా, మూడేళ్లుగా ఉక్రెయిన్ కు జరుగుతున్న ఆయుధ సరఫరాను కొనసాగిస్తారా అని మీడియా ప్రశ్నించగా, ఈ అంశం తమ పరిశీలనలో ఉందని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో మాట్లాడుతున్నామని చెప్పారు. శాంతి ఒప్పందాన్ని జెలెన్ స్కీ బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.