మొదటి రెండు రోజుల్లో ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల్లో ముఖ్యమైనవి!
వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు.
By: Tupaki Desk | 22 Jan 2025 4:44 AM GMTకొందరు అధినేతలు మాటలు చెబుతారు. మరికొందరు చేతల్లో చూపిస్తారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్ట్ ట్రంప్.. తాను చెప్పిన మాటలకు ఏ మాత్రం తేడా లేకుండా చేతల్నిచూపిస్తున్నారు. దేశాధ్యక్షుడి హోదాలో మొదటి రెండు రోజుల్లో సంచలన నిర్ణయాల్ని తీసుకున్నారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని సంచలనంగా మారగా.. మరికొన్ని వివాదాస్పదంగా మారాయి. మొండోడు రాజు కంటే బలవంతుడన్న సామెతకు తగ్గట్లే మొండోడే రాజు అయితే సీన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు.
మొదటి రెండు రోజుల్లో ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల్లో ముఖ్యమైనవి సమగ్రంగా చూస్తే..
- గత ఎన్నికల్లో ట్రంప్ ఓటమి నేపథ్యంలో ఆయన మద్దతుదారులు 2021 జనవరి ఆరున క్యాపిటల్ హిల్ పై దాడిలో పాల్గొనటం.. ఈ సందర్భంగా 1500 మందిపై కేసులు కట్టారు. తీవ్ర అభియోగాల్ని నమోదు చేశారు. ట్రంప్ కు అరవీర భయంకర మద్దతుదారులైన వారంతా గడిచిన నాలుగేళ్లుగా కేసుల్ని ఎదుర్కొంటున్నారు. తాను దేశాధ్యక్ష బాధ్యతల్ని చేపట్టినంతనే వారందరికి (1500 మందికి) క్షమాభిక్ష పెడుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు.
- పోలీసు అధికారులపై దాడి చేయటంతో పాటు హింసకు పాల్పడిన వారి జైలు శిక్షల్ని రద్దు చేశారు. అమెరికా న్యాయ చరిత్రలో అతి పెద్ద దర్యాఫ్తుగా కొనసాగుతున్న ఈ ఘటనకు సంబంధించిన 450 కేసుల్ని డిస్మిస్ చేయాలని అటార్నీ జనరళ్లకు సూచన చేశారు.
- వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆదేశాలపైనా ఆయన సంతకం చేశారు. అధికారం చేతిలోకి తీసుకోగానే ఆయనీ నిర్ణయాన్ని అమలు చేశారు. ఇంతకూ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు వైదొలిగినట్లు? అన్న ప్రశ్నకు ట్రంప్ లాజిక్ తో కూడిన సమాధానాన్ని ఇస్తున్నారు. ఆయన ఆన్సర్ అమెరికన్లకు తెగ నచ్చేస్తోంది.
- ఇంతకూ ట్రంప్ లాజిక్ ఏమంటే.. చైనా లాంటి కాలుష్య కారక దేశాల కోసం అమెరికా ప్రజల పన్ను డబ్బుల్ని ఖర్చు చేయటం ఏమిటి? అన్నది ఆయన ప్రశ్న. 2017లోనూ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా ప్రకటించి.. బయటకు వచ్చేశారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. తాజాగా ట్రంప్ మరోసారి ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు.
- గతంలో దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాల్ని రద్దు చేస్తూ సంతకాలు చేశారు ట్రంప్.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదా ట్రంప్ సంతకం చేశారు. కొవిడ్ వేళ.. ఆ సంస్థ సమర్థంగా పని చేయలేదన్నది ట్రంప్ కంప్లైంట్. ఈ సంస్థకు అమెరికా 500 మిలియన్ డాలర్లను ఇస్తోందని.. చైనా కేవలం 39 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తోందని.. ఇంత వ్యత్యాసం ఏమిటి? అన్నది ట్రంప్ ప్రశ్న.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగిన నేపథ్యంలో తాము మద్దతు ఇస్తామని చైనా ప్రకటించింది. సదరు సంస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించింది.
- కెనడా.. మెక్సికోలపై అదనపు సుంకాలు విధించే ఆదేశాల్ని ఇవ్వనున్నట్లుగా ప్రకటించిన ట్రంప్.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలు అమలవుతాయని ప్రకటించారు. ప్రస్తుతానికి చైనా.. భారత్ లపై సుంకాలకు సంబంధించి మాత్రం ఆయన నిర్ణయం తీసుకోలేదు.
- అమెరికాలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ఉన్న వర్కుఫ్రం హోం విధానాన్ని రద్దు చేశారు ట్రంప్. వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. సైన్యంతో పాటు కొన్ని అత్యవసర విభాగాల్లో తప్ప అన్ని శాఖల్లో నియామకాలపై బ్యాన్ విధించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ఉద్యోగుల భారాన్ని తగ్గించాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
- అమెరికాలోకి ప్రవేశించే వారు.. ఇప్పటికే ఉన్న వారు.. స్థానిక పౌరుల పట్ల.. కల్చర్ పట్ల.. ప్రభుత్వం పట్ల.. సంస్థల పట్ల.. సిద్ధాంతాల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించకుండా ముందే గుర్తించే ఆదేశాల మీద సంతకం చేశారు.
- అమెరికాకు వచ్చిన వారు విదేశాల్లోని ఉగ్రవాదులకు సాయం చేయకుండా చూడటమే దీని లక్ష్యం. అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల్ని గుర్తించి.. ఆ దేశాల నుంచి ఎవరూ రాకుండా ఏక మొత్తంగా నిషేధం విధించే ఆలోచన కూడా ఉందని చెబుతారు.
- బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఏఐ విస్తరణను నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాల్ని తొలగిస్తూ ట్రంప్ సంతకం చేవారు.
- సరిహద్దు గోడ సామాగ్రిని అమ్మాలన్న ఆదేశాల్ని వెనక్కి తీసుకున్నారు.
- వాక్ స్వాతంత్ర్యం మీద విధించిన నియంత్రణను ట్రంప్ ఎత్తేశారు. దీంతో అమెరికన్లపై సెన్సార్ షిప్ తొలిగిపోనుంది.