సంచలన వీడియో : యుద్ధం ఆగదు.. ట్రంప్ తోనే లొల్లి పెట్టుకున్న జెలెన్ స్కీ
అలాంటి వైట్ హౌస్ లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత రేర్ సీన్ ఒకటి చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 1 March 2025 9:40 AM ISTఅది వైట్ హౌస్. ప్రపంచానికే పెద్దన్న అడ్డా. అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే.. ఎక్కడ ఎంత తోపు అయినా.. సదరు వైట్ హౌస్ వద్దకు వచ్చేసరికి ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు దేశాధినేతలు. తొందరపాటుకు అవకాశం ఇవ్వరు. ఒకసారి తేడా వస్తే.. దాని దిద్దుబాటుకు చాలానే టైం పడుతుంది. అలాంటి వైట్ హౌస్ లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత రేర్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఇరువురు దేశాధినేతల మధ్య జరిగిన చర్చ హాట్ హాట్ గా సాగటమే కాదు.. తన అధిక్యతను ప్రదర్శించే విషయంలో అగ్రరాజ్యం ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లుగా తెలియజేశారని చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన చర్చ.. మాటల యుద్ధంగా మారింది. వైట్ హౌస్ వేదికగా ఇరువురు అధినేతల చర్చ సీరియస్ గా సాగింది. ఇదో టీవీ డిబేట్ మాదిరి మారటమే కాదు.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటం.. ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయటమే లక్ష్యంగా ఏర్పాటైన భేటీ.. చివరకు అదేమీ జరగకుండా జెలెన్ స్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పై ట్రంప్ సంచలన విమర్శలు చేశారు.రష్యా చేస్తునన యుద్ధానికి తెరదించటానికి శాంతి ఒప్పందం కుదుర్చటం.. దానికి బదులుగా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించటానికి అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ట్రంప్ మీదా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీద ఒత్తిడి చేశారు.దీంతో ఇద్దరు అధినేతల మధ్య మొదలైన చర్చలు చివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. మీడియా ఎదుటే వాదులాట వరకు వెళ్లటం సంచలనంగా మారింది. ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజల జీవితాలతో మీరు చెలగాటం ఆడుతున్నారంటూ జెలెన్ స్కీ మీద ట్రంప్ అండ్ కో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ ఆలోచనల కారణంగా మూడో ప్రపంచ యుద్దం వచ్చేలా ఉంది. మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోంది. ఉక్రెయిన్ అతి పెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది. దీని నుంచి బయటకు రావటం అసాధ్యం. చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ మాట్లాడుతున్న సమయంలోనే కొన్ని మాటలకు జెలెన్ స్కీ స్పందించారు. వెంటనే సమాధానం ఇచ్చారు. జెలెన్ స్కీ వాదనను చూస్తే.. ‘ఉక్రెయిన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి. మా దేశ భూభాగంలో మేం ఉంటున్నాం. మేం అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలా? మేం ద్రఢ సంకల్పంతో ఉన్నాం. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు మాకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అన్నారు.
అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. జెలెన్ స్కీని గట్టిగా మాట్లాడొద్దన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పగా స్పందించిన జెలెన్ స్కీ ఎలాంటి దౌత్యం? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో వాన్స్ అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించటం సరికాదన్నారు. వాన్స్ వ్యాఖ్యల వేళలోనే మరోసారి ట్రంప్ స్పందించారు.
జెలెన్ స్కీను ఉద్దేశించి సీరియస్ గా మాట్లాడుతూ.. ‘రష్యాతో యుద్ధంలో అమెరికా మీకు ఎంతో సాయం చేసింది. మీకు మద్దతుగా నిలిచాం. ఆయుధాలు సమకూర్చాం. 350 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని చేశాం. మా సైనిక పరికరాలే లేకపోతే.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేది. ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనిక బలగం తగ్గిపోయింది. అయినప్పటికి మీకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు. యుద్ధమే చేస్తామంటున్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి అంగీకరించండి. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది. మరణాలు ఆగుతాయి’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి జెలెన్ స్కీ స్పందించారు. రెండు రోజుల క్రితం పుతిన్ కూడా ఇవే మాటలు అన్నారని.. శాంతి ఒప్పందం గురించి అమెరికా గత ప్రభుత్వ నేతలను అడిగితే.. వారేం చెబుతారో వినాలంటూ అంతే ధీటుగా స్పందించారు.ఖనిజాల ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య చర్చ అర్థంతరంగా ఆగిపోయింది.
ఈ భేటీ అనంతరం జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం ఉక్రెయిన్ భద్రతకు అనుకూలంగా ఉండాలని, తాము మూడో ప్రపంచ యుద్ధం కోరుకోవడం లేదని వెల్లడించారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాల గురించి మాట్లాడుతూ, ట్రంప్ తటస్థంగా ఉండాలని, కానీ ఉక్రెయిన్ వైపు నిలబడాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
చివరకు ఒప్పందం కుదరకుండా వాగ్వాదంతోనే ఈ సమావేశం ముగిసింది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమెరికా, ఉక్రెయిన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఎలా కొనసాగుతాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.