"నాకు ఓటేయకపోతే రక్తపాతమే"
తాజాగా ఒహైయో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్.. నన్ను గెలిపించకపోయినా.. నేను గెలవకపో యినా దేశంలో రక్తపాతం జరుగుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు గుప్పించారు.
By: Tupaki Desk | 17 March 2024 9:30 AM GMTఔను.. అక్షరాలా ఎన్నికల ప్రచారంలో ఓ నేత ఈ వ్యాఖ్యలే చేశారు. అయితే.. మన ఏపీలోనో.. తెలంగాణ లోనో కాదు.. అమెరికాలో. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు పారేసుకున్నారు. ఈ ఏడాది నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన ఆయన తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అదే సమయంలో అమెరికన్లను కూడా ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒహైయో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్.. నన్ను గెలిపించకపోయినా.. నేను గెలవకపో యినా దేశంలో రక్తపాతం జరుగుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు గుప్పించారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని తెలిపారు. ''నేను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది'' అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను ట్రంప్ తూర్పారబడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శ లు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికోలో చైనా ఏర్పాటు చేయాలని భావిస్తున్న కార్ల తయారీ కేంద్రాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ''మీ ఆటలు సాగవు. నేను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోను'' అని వ్యాఖ్యానించారు.
చైనా తయారు చేసే కార్లపై 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను కూడా ఆయన తప్పుబట్టారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే.. ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ఎన్నికల ప్రచార కమిటీ అధికార ప్రతినిధి కారోలిన్ లీవిట్ వివరణ ఇచ్చారు.
బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం తప్పుబట్టింది. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిప్పికొట్టారని, దీంతో ఘోర ఓటమి చవిచూసిన ట్రంప్ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది.