Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పై హత్యాయత్నం ఘటనతో దానికి మంచి రోజులు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం ఘటనతో క్రిప్టోకరెన్సీ, బిట్‌ కాయిన్‌ లకు మంచి రోజులొచ్చాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 10:30 AM GMT
ట్రంప్‌ పై హత్యాయత్నం ఘటనతో దానికి మంచి రోజులు!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం ఘటనతో క్రిప్టోకరెన్సీ, బిట్‌ కాయిన్‌ లకు మంచి రోజులొచ్చాయి. హత్యాయత్నం ఘటనతో ట్రంప్‌ కు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు పెరిగాయన్న వార్తల నేపథ్యంలో బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ దూసుకెళ్లింది. క్రిప్టో కరెన్సీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకూలమనే సంగతి తెలిసిందే. ఇప్పుడు హత్యాయత్నం ఘటనతో ఆయనకే విజయావకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుండటంతో క్రిప్టోకరెన్సీ బలపడింది.

అమెరికా కాలమానం ప్రకారం.. జూలై 14 మధ్యాహ్నం 12:10 గంటలకు, బిట్‌కాయిన్‌ 8.6% పెరిగి 63,000 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈథర్‌ కూడా 6.8% పెరిగి 3,350 డాలర్లకు చేరుకుంది.

వచ్చే ఏడాది నవంబర్‌ లో జరుగుతున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తో డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీపడుతున్నారు. కాగా బిట్‌ కాయిన్స్‌ వంటి క్రిప్టో కరెన్సీకి డెమోక్రాట్లు వ్యతిరేకం. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. క్రిప్టోకు రిపబ్లికన్లు అనుకూలంగా ఉన్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారే. క్రిప్టో కరెన్సీని నియంత్రించడానికి డెమోక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్‌ గతంలో ఖండించారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీకి తనను తాను చాంపియన్‌ గా అభివర్ణించుకున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ కే విజయావకాశాలు ఉన్నాయన్న వార్తలతో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ దూసుకుపోయింది. ఈ వారాంతంలో బిట్‌ కాయిన్‌ 62,000 డాలర్లకు పైగా పెరిగింది.

గత 24 గంటల్లో.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ 1.241 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. బిట్‌కాయిన్‌ ఆధిపత్యం ప్రస్తుతం 53.95% పెరిగింది. గత 24 గంటల్లో వాల్యూమ్‌ 22.8% పెరిగి 25.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

ట్రంప్‌ పై హత్యాయత్నం ఘటన మార్కెట్‌ సెంటిమెంటును గణనీయంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. 70 శాతానికి పైగా ఆయన గెలుపు అవకాశాలు పెరిగాయని పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి.

దీంతో ప్రముఖ క్రిప్టోకరెన్సీలయిన.. సోలానా, ఎక్స్‌ఆర్‌పీ, టోన్‌ కాయిన్, డోగ్‌ కాయిన్, కార్డానో, ట్రాన్, షిబా ఇను, అవలాంచె, పోల్కాడోట్, చైన్‌ లింక్, నియర్‌ ప్రోటోకాల్‌ తో సహా ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీలు కూడా 6% వరకు పెరిగాయి.

కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ ప్రకారం.. అన్ని స్టేబుల్‌ కాయిన్‌ల వాల్యూమ్‌ ఇప్పుడు 52.9 బిలియన్లు డాలర్లుగా ఉంది. ఇది మొత్తం క్రిప్టో మార్కెట్‌ 24–గంటల వాల్యూమ్‌లో 90.36% శాతం కావడం గమనార్హం.