Begin typing your search above and press return to search.

తగ్గని ట్రంప్ హవా... మగ్‌ షాట్‌ తో సరికొత్త రికార్డు!

అత్యంత వివాదాస్పద అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హిస్టరీ క్రియేట్ చేశారని చెబుతుంటారు

By:  Tupaki Desk   |   25 Aug 2023 10:25 AM GMT
తగ్గని ట్రంప్ హవా... మగ్‌ షాట్‌ తో సరికొత్త రికార్డు!
X

అత్యంత వివాదాస్పద అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హిస్టరీ క్రియేట్ చేశారని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల్లో జోక్యం ఆరోపణల్లో జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు ట్రంప్. దీంతో... ఆ దేశ చరిత్రలో మగ్‌ షాట్‌ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.

అవును... జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయిన ట్రంప్... రెండు లక్షల డాలర్ల బాండ్ సమర్పించి బెయిల్ పొందారు. ఈ సమయంలో సుమారు 20 నిమిషాల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఖైదీ నంబ ర్‌ P01135809 కేటాయించారు.

ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌ షాట్‌) కూడా తీశారు. పోలీసు రికార్డుల ప్రకారం ట్రంప్‌ ఎత్తు 6.3 అడుగులు కాగా.. బరువు 97 కిలోలు. ఆయనకు నీలి రంగు కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్‌ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. తాజాగా ఈ ఫొటో ఆన్‌ లైన్‌ లో వైరల్‌ గా మారింది.

గత ఐదు నెలల్లో ట్రంప్‌ నాలుగు సార్లు అరెస్టు అయ్యారు కానీ.. పోలీసు కేసు కింద బుక్‌ చేసి తీసిన తొలి ఫొటో మాత్రం ఇదే కవడం గమనార్హం. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఈ ఫొటోను షేర్‌ చేసి ట్రంప్‌ కు మద్దతు ప్రకటించారు.

కాగా... గతంలో అమెరికా ప్రముఖలు ఎల్విస్‌, ఫ్రాంక్‌ సినంట్రా, అల్‌ కాపోన్‌, డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ వంటి వారు పోలీసు కేసుల్లో అరెస్ట్‌ అయినప్పుడు ఫొటోలు తీశారు.

ఆ సంగతి అలా ఉంటే.... గత కొంతకాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్న ట్రంప్ తాజాగా యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగా మగ్‌ షాట్‌ ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దానికి "ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూ లొంగను.." అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఈ ట్వీట్‌ ను కేవలం రెండు గంటల్లో 4.2 కోట్ల మంది వీక్షించగా.. రెండు లక్షల సార్లు రీట్వీట్‌ చేశారు.

కాగా ట్రంప్‌ ను 2021 జనవరి 6వ తేదీన ట్విటర్‌ యాజమాన్యం బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆయనకు 80 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లున్నారు. అయితే ఆ తర్వాత ట్విటర్‌ యాజమాన్యం మారి పగ్గాలు ఎలాన్‌ మస్క్‌ చేతికొచ్చాక.. గత నవంబర్‌ లో ట్రంప్‌ పై బ్యాన్‌ తొలగించారు.