తుపాకీ సంస్కృతిని వద్దన్న ట్రంప్.. ఆయనపైనే కాల్పులు!!
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగి పోయింది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎటు నుంచి తుపాకీ మోత వినిపిస్తుందో
By: Tupaki Desk | 14 July 2024 4:35 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగి పోయింది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎటు నుంచి తుపాకీ మోత వినిపిస్తుందో.. ఎవరి ప్రాణాలు గాలిలో కలిసి పోతాయో చెప్పలేనంత పరిస్థితి ఇప్పుడు అగ్రరాజ్యాన్ని పట్టి పీడిస్తోంది. ఈ తుపాకీ సంస్కృతి కారణంగా.. గత 2023-24(ఆర్థిక సంవత్సరం)లో దేశవ్యాప్తంగా 2350 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఏపీకి చెందిన ఓ యువకుడిపై జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన యువకుడు.. ఓ మార్ట్‌లో పనిచేస్తున్నాడు.
ఆ సమయంలో దూసుకువచ్చిన దుండగుడు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దీంతో ఏపీకి చెందిన యువకుడు అన్యాయంగా బలైపోయాడు. ఇలాంటి అమాయకులు.. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట బలవుతూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుడు ఎవరనేది తేలాల్సి ఉంది. ఇతను ప్రత్యర్థి పార్టీ డెమొక్రాటిక్ కు చెందిన వ్యక్తి అని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. అయితే.. అధికారులు మాత్రం ఇంకా గుర్తించలేదని తెలిపారు.
ఇదిలావుంటే.. అసలు ట్రంప్ ఆశయం ఏంటనేది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం విచ్చలవిడిగా ఉన్న తుపాకీ సంస్కృతిని తాను అధికారంలోకి వస్తే.. అంతం చేస్తానని ఆయన ప్రకటించారు. కొన్నాళ్ల కిందటే ఆయన న్యూజెర్సీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. దీనిని తీవ్రంగా ఖండిం చారు. బైడెన్ సర్కారులో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. తాను పగ్గాలు చేపట్టాక తొలి నెలలోనే తుపాకీ సంస్కృతిని అంతం చేసి.. ప్రజల ప్రాణాలకు స్వేచ్ఛ కల్పిస్తానని కూడా ప్రకటించారు.
అయితే.. చిత్రంగా ట్రంప్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం కావడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీలోనే ఆయన చేసిన ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర దేశాల్లో మాదిరిగా ప్రజల భద్రత విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. అమెరికాలో సంపన్న కుటుంబాలకు తుపాకీలు ఇచ్చే ప్రక్రియ 5 దశాబ్దాల కిందటే జరిగింది. ఆ తర్వాత.. ఇది విచ్చలవిడి అయిపోయింది. దీంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా జంకుతున్నారన్నది ఆర్థిక నిపుణుల ఆవేదన. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ హామీని ఇచ్చారు. అయితే.. ఆయనపైనే తుపాకీ ప్రయోగం జరగడం దారుణం.