Begin typing your search above and press return to search.

ట్రంప్‌.. మరోసారి కంపు కంపు!

ప్రపంచంలో ఏకైక అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి

By:  Tupaki Desk   |   10 July 2024 9:31 AM GMT
ట్రంప్‌.. మరోసారి కంపు కంపు!
X

ప్రపంచంలో ఏకైక అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

గత అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాలని ఆశించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కు అనూహ్య ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి పాలయ్యారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థుల మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో పలుమార్లు తన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. అయినప్పటికీ ఆయన తగ్గడం లేదు.

తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు ఆమె ఇన్సూరెన్స్‌ పాలసీలాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఈ నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా తప్పించి డెమోక్రాట్ల తరఫున కొత్త వ్యక్తి పోటీ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ పై ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక ఎన్నికల ప్రచార సభలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. జో బైడెన్‌ వంకర బుద్ధి కలిగినవాడని.. అయితే ఆయనను ఒక విషయంలో మెచ్చుకోవచ్చన్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలినే వచ్చే ఎన్నికలకు కూడా తన ఉపాధ్యక్షురాలిగా పెట్టుకున్నారన్నారు. ఇది ఆయన తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయమే ఆయనకు మంచి బీమా పాలసీ కావచ్చని ఎగతాళి చేశారు.

జో బైడెన్‌ అద్యక్షుడు అయినప్పుడు సగం సమర్థుడిని అయినా ఉపాధ్యక్షుడిగా పెట్టుకుని ఉండాల్సిందన్నారు. అలాంటి వ్యక్తి ఉండి ఉంటే ఎప్పుడో బైడెన్‌ ను అధ్యక్షుడి పదవి నుంచి సాగనంపేవారని ట్రంప్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే కమలా హారిస్‌ ఉపాధ్యక్ష స్థానంలో ఉండటంతో జో బైడెన్‌ ను ఎవరూ పదవి నుంచి సాగనంపలేరని వ్యాఖ్యానించారు. తద్వారా కమలా హారిస్‌ పైనా ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తన విధి నిర్వహణలో విఫలమయ్యారని ట్రంప్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఆమెకు అప్పగించిన రెండు పనిల్లోనూ విఫలం చెందారన్నారు. దేశ సరిహద్దులను కాపాడటం, అలాగే రష్యా.. ఉక్రెయిన్‌ పై దాడి చేయకుండా ఆపడంలో కమల ఘోర వైఫల్యం చెందారని ట్రంప్‌ ఆరోపించారు. దీనివల్ల 1,50,000 మంది పిల్లల జీవితాలు నాశనమయ్యాయని మండిపడ్డారు.

కాగా గతంలో పలు వివాదాలు, లైంగిక వేధింపులు, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ట్రంప్‌ కు నాలుగు కేసుల్లో జైలుశిక్షలు పడ్డాయి. వాటిపైన ఆయన అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు డోనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని అంటున్నారు.