Begin typing your search above and press return to search.

ట్రంప్‌కు పూచీక‌త్తు క‌ష్టాలు.. ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదే!

అమెరికా మాజీ అధ్య‌క్షుడు, రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ ప‌రిస్థితి దారుణంగా మారింది.

By:  Tupaki Desk   |   19 March 2024 10:12 AM GMT
ట్రంప్‌కు పూచీక‌త్తు క‌ష్టాలు.. ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదే!
X

అమెరికా మాజీ అధ్య‌క్షుడు, రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ ప‌రిస్థితి దారుణంగా మారింది. ప్ర‌స్తు తం ఆయ‌న అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. అయితే.. ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌కు సంబంధించి.. ఇటీవ‌ల కోర్టులు జ‌రిమానా విధించాయి. వీటిని చెల్లించ‌డం మాట అటుంచితే... ముందు.. ఈ మొత్తాల‌కు హామీలు(పూచీక‌త్తు) స‌మ‌ర్పించి.. త‌ర్వాత వాద‌న‌లు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కోర్టులు తెలిపాయి. దీంతో ట్రంప్ న్యాయ‌వాదులు పూచీక‌త్తు ఇచ్చే కంపెనీల కోసం వెతికారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క కంపెనీ కూడా ముందుకురాలేదు.

``డజన్ల కొద్దీ కంపెనీలను సంప్రదించాం అయితే ఫ్రాడ్ కేసులోన్యూయార్క్ సివిల్ కోర్టు చెల్లించాలని ఆదేశించిన $464m (£365m)కి హామీ ఇవ్వడానికి ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ముందుకు రాలేదు`` అని ట్రంప్ త‌ర‌ఫున న్యాయ‌వాది పేర్కొన్నారు. ట్రంప్‌ తన వాద‌న‌ల‌ను కొనసాగించడానికి పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. లేదా బాండ్‌ను స‌మ‌ర్పించాలి. దీనిని ఇవ్వ‌డానికి ఏ కంపెనీ కూడా ముందుకురాలేదు.

ఈ మొత్తాన్ని కోర్టుకు స‌మ‌ర్పించ‌క‌పోతే.. అప్ప‌టి వ‌ర‌కు ట్రంప్ వ్యాపార‌మైన రియల్ ఎస్టేట్ ఆస్తులలో కొన్ని లిక్విడేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రంప్‌.. హామీ ఇచ్చే కంపెనీ కోసం వెతుకుతున్నారు. కానీ, ఇలా క‌నుక ఇస్తే.. సద‌రు కేసులో ట్రంప్ ఓడిపోతే.. ఆ మొత్తం కంపెనీ న‌ష్ట‌పోతుంది. దీనిని ట్రంప్ తిరిగి ఇస్తార‌న్న న‌మ్మ‌కం కంపెనీకి లేదు. అందుకే ఏదీ కూడా ముందుకు రాలేద‌ని తెలిసింది.

అయితే.. ట్రంప్ ఈ విష‌యాన్ని గ్ర‌హించారు. అందుకే ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని విప‌క్షాల విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు. ``నా వంటి విజయవంతమైన కంపెనీ సహా ఏ కంపెనీకైనాఈ మొత్తం చెల్లించ‌డం అసాధ్యం" అని చెబుతున్నారు. "బాండింగ్ కంపెనీలు ఇంతకు ముందు ఇంత పరిమాణంలో బాండ్ గురించి వినలేదు" అని అంటున్నారు.

వాస్త‌వానికి ట్రంప్ న్యాయ‌వాదులు, ఆయ‌న కంపెనీల సీఈవోలు ప్రపంచంలోని అతిపెద్ద బీమా కంపెనీలలో ఒక‌దానిని సంప్ర‌దించారు. కానీ వారు అంగీక‌రించ‌లేదు. 30 కంపెనీలను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని లాయర్లు తెలిపారు. ఈ కేసులో ట్రంప్ ఇద్దరు కుమారులు కూడా మిలియన్ డాలర్లు చెల్లించాలి. పెనాల్టీ చెల్లించాల్సిందిగా ట్రంప్‌ను ఆదేశించడంతో పాటు, మెరుగైన రుణ ఒప్పందాలను పొందేందుకు ఆయ‌న‌ ఆస్తులను తప్పుడుగా పెంచినట్లు గుర్తించిన న్యూయార్క్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ మూడేళ్లపాటు రాష్ట్రంలో ఎలాంటి వ్యాపారాలను నిర్వహించకుండా నిషేధించారు.

ఒక న్యాయమూర్తి గత నెలలో ట్రంప్ వ్యాపార నిషేధాన్ని పాజ్ చేసారు. అయితే జరిమానాను త‌గ్గించాల‌న్న విన్న‌పాన్ని మాత్రం తోసిపుచ్చారు. అయితే.. సాధార‌ణంగా చిన్న మొత్తాలకైతే బాండ్లు జారీ చేస్తారు. కానీ, ట్రంప్‌కు విధించిన జ‌రిమానా పెద్ద‌ది కావ‌డం.. ఆయ‌న ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డ‌డం సాధ్యం కాద‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ఏ కంపెనీ కూడా ముందుకు రావ‌డం లేదు.

``ఈ స్థాయిలో జరిమానాలు సాధారణంగా పెద్ద కంపెనీలపై విధిస్తారు. ట్రంప్ తీర్పుపై అప్పీల్ చేస్తున్నప్పుడు ఆయ‌న‌ న్యాయ బృందం ఆలస్యంగా స్పందించింది. ఆయ‌న త‌న‌ ఆస్తులను లిక్విడేట్ చేయడం ప్రారంభించే అవకాశాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో కోర్టు అతనికి మరింత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా అనే దానిపై ఈ కేసు ఆధార‌ప‌డి ఉంటుంది`` అని న్యాయ‌నిఫుణులు పేర్కొంటున్నారు.