Begin typing your search above and press return to search.

ఎంత మొండిఘటం? కాల్పులతో గాయపడిన వేళలో ట్రంప్ స్పందన ఏంటి?

అనూహ్య పరిణామం చోటు చేసుకున్నప్పుడు ఆ షాక్ లో ఉండిపోతారు. ఆ మాటకు వస్తే ఎలా రియాక్టు కావాలో అర్థం కానట్లుగా ఉంటారు

By:  Tupaki Desk   |   14 July 2024 3:59 AM GMT
ఎంత మొండిఘటం? కాల్పులతో గాయపడిన వేళలో ట్రంప్ స్పందన ఏంటి?
X

అనూహ్య పరిణామం చోటు చేసుకున్నప్పుడు ఆ షాక్ లో ఉండిపోతారు. ఆ మాటకు వస్తే ఎలా రియాక్టు కావాలో అర్థం కానట్లుగా ఉంటారు. భయపడిపోతారు. కాల్పులు జరగటం ఒక ఎత్తు. అందులో గాయపడటం మరో ఎత్తు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఘటనకు కొన్ని క్షణాలు ఆ షాక్ లోనే ఉండిపోతారు. అందరూ అలా ఉంటే ట్రంప్ గొప్పతనం ఏముంటుంది?

కాల్పుల్లో గాయపడిన ఒక నిమిషం వ్యవధిలోనే ఆయన తేరుకోవటం.. అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెల్లే క్రమంలో కాల్పుల షాక్ లో ఉన్న తన మద్దతుదారులకు అభివాదం చేయటమే కాదు.. మరింత బలంగా పోరాడదామన్న సంకేతాన్ని ప్రదర్శిస్తూ.. అక్కడున్న వారిలో పోరాటస్ఫూర్తిని నింపేలా వ్యవహరించిన ట్రంప్ తీరు చూస్తే.. ఆయన ఎంత మొండిఘటమన్న విషయం దీనికి సంబంధించిన చిట్టి వీడియో చూస్తే అర్థమవుతుంది.

తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న వేళలో కాల్పుల మోత వినిపించటం.. ఆ వెంటనే తన చేతిని మెడ వెనుక పెట్టుకున్న ట్రంప్.. క్షణంలో వెయ్యి వంతు అన్నట్లుగా కిందకు వంగారు. ఆ లోపే తూటాల శబ్దాలు వరుస పెట్టి వచ్చాయి. దీంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పలువురు వెంటనే కిందకు వంగిపోయారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. క్షణాల వ్యవధిలోనే ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను రౌండప్ చేశారు.

నిమిషం పాటు వేదిక కిందనే ఉన్న ఆయన.. నిమిషం దాటిన తర్వాత ఆసుపత్రికి తరలించే క్రమంలో చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు గోడ కట్టేసినట్లుగా చుట్టుముట్టి ఉండగా.. పిడికిలిని బిగించి.. సీరియస్ గా రియాక్ట్ కావటంతో పాటు.. తాను స్ట్రాంగ్ గా ఉన్నట్లు సంకేతాలు ఇస్తూ.. కసిగా మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా కాల్పుల షాక్ తగిలిన వేళ గంట పాటు స్పందించలేనట్లుగా వ్యవహారిస్తారు. కానీ.. 78 ఏళ్ల వయసున్న ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అయిన తీరు చూస్తే.. ఆయన ఎంత మొండోడు అన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.