Begin typing your search above and press return to search.

పోలీస్‌ ఆ పని చేయకుండా ఉంటే కాల్పుల ఘటన జరిగేదే కాదు!

కాగా కాల్పుల ఘటనకు ముందే దుండగుడిని ఒక పోలీస్‌ చూశాడు. రైఫిల్‌ చేత ధరించి భవనంపైకప్పు ఎక్కుతుండగా పోలీసు అతడిని చూశాడు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:42 PM GMT
పోలీస్‌ ఆ పని చేయకుండా ఉంటే కాల్పుల ఘటన జరిగేదే కాదు!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దుండగులు సమీపంలో ఉండి రైఫిల్‌ తో కాల్పులు జరపడంతో ట్రంప్‌ చెవికి తీవ్ర గాయమైంది. ట్రంప్‌ తలను లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులు జరపగా.. అదే సమయంలో ట్రంప్‌ తన తలను పక్కకు తిప్పడంతో బుల్లెట్‌ చెవికి తగిలింది.

కాగా దుండగుడిని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది కాల్చిచంపారు. మరో వైపు దుండగుడి కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. నిందితుడిని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ గా పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అతడి ఫొటోను కూడా విడుదల చేశారు.

కాగా కాల్పుల ఘటనకు ముందే దుండగుడిని ఒక పోలీస్‌ చూశాడు. రైఫిల్‌ చేత ధరించి భవనంపైకప్పు ఎక్కుతుండగా పోలీసు అతడిని చూశాడు. అయితే దుండగుడు రైఫిల్‌ తో బెదిరించడంతో ఆ పోలీస్‌ మిన్నకుండిపోయాడని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత దుండగుడు థామస్‌ మాథ్యూ క్రూక్‌.. ట్రంప్‌ పై కాల్పులకు పాల్పడ్డాడు.

మరోవైపు దుండగుడు థామస్‌ మాథ్యూ క్రూక్‌ గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ కంపెనీ.. బ్లాక్‌ రాక్‌ రూపొందించిన ప్రకటనలో కూడా నటించినట్టు వెలుగుచూసింది. ఇప్పుడు తాజా ఘటనతో ఆ యాడ్‌ ను బ్లాక్‌ రాక్‌ తొలగించింది.

బ్లాక్‌ రాక్‌ కు ప్రపంచంలోనే అతిపెద్ద మనీ మేనేజింగ సంస్థగా పేరుంది. ఈ క్రమంలో 2022లో థామస్‌ మాథ్యూ క్రూక్‌ తో ఒక యాడ్‌ ను రూపొందించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌ హైస్కూల్‌ లోనే దాన్ని చిత్రీకరించారు. ఈ యాడ్‌ లో బెతెల్‌ పార్క్‌ స్కూల్‌ విద్యార్థులు కొందరు నటించగా.. అందులో థామస్‌ కూడా ఉండటం గమనార్హం.

ఇప్పుడు ట్రంప్‌ పై కాల్పుల ఘటనతో ఆ యాడ్‌ కూడా వైరల్‌ అయ్యింది. దీంతో తమ కంపెనీకి మచ్చగా నిలుస్తుందనే భయంతో ఆ యాడ్‌ ను బ్లాక్‌ రాక్‌ తొలగించింది. బ్లాక్‌ రాక్‌ వైబ్‌ సైట్‌ లోనూ ఆ యాడ్‌ ను తీసేసింది.

దుండగుడు థామస్‌ మాథ్యూ చదువులో చురుకైన విద్యార్థేనని తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాథ్స్‌ లో ప్రతిభకు నేషనల్‌ మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ ఇనీషియేటివ్‌ నుంచి 500 డాలర్ల బహుమానం కూడా పొందాడు. 2022లో బెతెల్‌ పార్క్‌ హైస్కూల్‌ నుంచే అతడు గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేశాడు.

కాగా కాల్పుల ఘటనకు పాల్పడటం వెనుక అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. స్కూళ్లో తోటి విద్యార్థులు థామస్‌ మాథ్యూను వేధించేవారని సమాచారం. ముఖ్యంగా అతడు ధరించే దుస్తులను చూసి గేలిచేసేవారని అతడి క్లాస్‌ మేట్‌ ఒకరు వివరించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో తాను ట్రంప్‌ ను, రిపబ్లికన్‌ పార్టీని వ్యతిరేకిస్తున్నట్టు థామస్‌ మాథ్యూ వెల్లడించాడు. అలాగే అతడు గతంలో 15 డాలర్లను డెమోక్రటిక్‌ పార్టీకి విరాళంగా అందించడం గమనార్హం.