రామమందిరానికి 68 కోట్లు విరాళం... ఎవరీ దిలీప్?
ఈ క్రమంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు కూడా రాముని దర్శించుకునే అవకాశం కల్పించడంతో... భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2024 2:46 PM GMTఅయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మహాద్భుతంగా జరిగింది! ఈ సమయంలో నవనిర్మిత రామాలయంలో బాల రాముడు స్వర్ణ, వజ్రాభరణాలతో కొలువుదీరాడు. ఈ క్రమంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు కూడా రాముని దర్శించుకునే అవకాశం కల్పించడంతో... భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు.
ఈ సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. చిన్న పెద్దా అనే తారతమ్యాలు ఏమీ లేకుండా... అంతా విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అయోధ్య రాముడికి భారీ విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖి ముందువరుసలో ఉన్నారని చెప్పవచ్చు! ఈయన అయోధ్య రామాలయానికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు.
అవును... అయోధ్య రామమందిర నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు వచ్చిన నేపథ్యంలో... సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ 101 కేజీల బంగారం కానుకగా ఇచ్చారు. దీంతో ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, పిల్లర్లు, గర్భగుడి మొదలైనవాటికి కేటాయించారు. దీంతో... రామ మందిర ట్రస్ట్ కు ఇప్పటివరకు వచ్చిన విరాళాల్లో ఇదే అత్యధిక విరాళంగా తెలుస్తోంది!
ప్రస్తుత మార్కెట్ ధరలో 100 గ్రాముల ధర 68,000 వరకూ ఉండగా... మొత్తం విరాళం విలువ 68 కోట్ల రూపాయలకు పైగా అన్నమాట. ఇదే సమయంలో... ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపూ రూ.11.3 కోట్లు విరాళంగా చెల్లించగా... గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్ ఢోలాకియా రూ.11 కోట్ల రుపాయలు విరాళమిచ్చారు.
కాగా... అయోధ్యలో శ్రీరాముని నూతన ఆలయ నిర్మాణానికి విరాళాలుగా సుమారు 3 వేల కోట్లకు పైగా వచ్చాయని తెలుస్తుండగా... వాటిలో రూ.1800 కోట్లు ఖర్చు కాగా.. ఇంకా రూ.1200 కోట్లకు పైగా మిగిలినట్లు తెలుస్తుంది!