మరణాలే కాదు.. డంకీ రూట్ లో కిడ్నాప్ లూ.. బాధితులు ఇద్దరు భారతీయులు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపుతున్న నేపథ్యంలో డంకీ రూట్ పేరు బాగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 12 March 2025 11:00 PM ISTడంకీ రూట్.. వినడానికి కాస్త భిన్నంగా ఉండే పేరు.. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాకు అడ్డదారి.. ఈ దారిలో వెళ్తూ ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. మన దేశం వారే కాదు.. అమెరికా ఇరుగు పొరుగు దేశాల వారూ వీరిలో ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపుతున్న నేపథ్యంలో డంకీ రూట్ పేరు బాగా వినిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో భారతీయులు అక్రమంగా అమెరికా సహా ఏ ఇతర దేశాలకూ వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇదే సమయంలో ట్రంప్ తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను మూడు విమానాల్లో పంపించేశారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలు అలా ఉంటే.. డంకీ రూట్ లో దొడ్డిదారిన అమెరికాకు వెళ్లడం మాత్రం తగ్గలేదు.
గత ఏడాది డంకీ రూట్ లోనే కెనడా మీదుగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన గుజరాతీ కుటుంబం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల మరో వ్యక్తి కూడా భార్య బిడ్డతో డంకీ రూట్ లో అమెరికాలోకి వెళ్లబోయి చనిపోయాడు.
డిసెంబరులో డంకీ మార్గంలో అమెరికా వెళ్తున్న ఇద్దరు భారతీయులను గ్వాటెమాలాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఉదంతం బయటకు వచ్చింది. వారిని విడిచిపెట్టేందుకు 20 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కిడ్నాప్ అయినవారిలో హరియాణాకు చెందిన యువరాజ్ సింగ్ ఒకరు. తన కుమారుడు అమెరికాకు వెళ్లేందుకు ఏజెంట్ ను సంప్రదించాడని.. చట్టపరంగా వెళ్లేందుకు రూ.41 లక్షలకు డీల్ కుదిరిందని యువరాజ్ తండ్రి కుల్దీప్ సింగ్ తెలిపారు. తొలుత రూ.2 లక్షలు, మిగిలినవి అమెరికా వెళ్లాక చెల్లించాలనేది ఒప్పందంగా పేర్కొన్నారు. అయితే, మధ్యలోనే రూ.14 లక్షలు తీసుకున్నారని తెలిపాడు. బయల్దేరాక యువరాజ్ నుంచి ఫోన్ రాలేదని, నెట్ వర్క్ లేని ప్రాంతాల నుంచి వెళ్తున్నారని, అమెరికా వెళ్లాక మాట్లాడొచ్చని ఏజెంట్లు భరోసా ఇచ్చారని చెప్పాడు.
కిడ్నాపర్లు.. యువరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెడుతూ తుపాకీ చూపించి బెదిరించారని అతడి తండ్రి వాపోయాడు. విడిచిపెట్టాలంటే డబ్బు డిమాండ్ చేశారని చెప్పాడు. కిడ్నాప్ అయిన మరో వ్యక్తి పంజాబ్ లోని హూషియాపూర్ జిల్లా వ్యక్తి. విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు 20 వేల డాలర్లు డిమాండ్ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.