గెలిచే సత్తా లేక పోతే.. ఇంతే శ్రీదేవమ్మా!
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 22 March 2024 9:42 PM ISTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కలకలం రేగింది. ఈ పార్టీ నాయకురాలు.. కొన్నాళ్ల కిందట వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీకి జై కొట్టిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన అక్కసు వెళ్లగక్కారు. ``రాజకీయాలు ఇప్పుడు అర్ధమయ్యా`యం టూ ట్వీట్ చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం టీడీపీ మూడో జాబితా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ట్వీట్ చేశారు. అయితే.. ఇది రాజకీయంగా టీడీపీలో దుమారం రేపుతోంది.
``రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది`` అని శ్రీదేవి పేర్కొన్నారు. అంతేకాదు, `బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి `కత్తి` ఎమోజీ` పోస్టు చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఈ పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదు. కానీ, ఆమె ఆశించిన బాపట్ల పార్లమెంటు స్థానాన్ని టీడీపీ బీజేపీ వరంగల్ నాయకుడికి కేటాయించింది. దీంతో ఆమె తన అక్కసును వెల్లగళ్లగక్కారనే టాక్ మాత్రం టీడీపీలో వినిపిస్తోంది. ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే, వైసీపీలో ఇతర నేతలతో సఖ్యత లేక పోవడం.. తరచుగా వివాదలకు దారితీస్తుండడంతో వైసీపీ ఆమెకు ఈ ఎన్నికల్లో టికెట్ లేదని ఎప్పుడో చెప్పేసింది. దీంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా... ఈసారి ఎన్నికల్లో తిరువూరు(ఎస్సీ) అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు. కానీ, తిరువూరును అమరావతి ప్రాంతానికి చెందిన కొలిక పూడి శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఇక, తాజాగా బాపట్ల ఎంపీ స్థానానికి తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్ ను నియమించారు. ఈయన ఇంకా పార్టీలో చేరలేదు.
ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అయితే.. శ్రీదేవి అక్కసుపై టీడీపీలోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. సొంత పార్టీలోనే టికెట్ లేదని చెబితే.. చంద్రబాబు ఆశ్రయం కల్పించి.. పంచన చేర్చుకున్నారని.. ప్రజల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదని.. ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలని టీడీపీ నాయకులు అంటున్నారు. దీంతో శ్రీదేవి చేసిన ట్వీట్ రివర్స్ అయింది.