Begin typing your search above and press return to search.

ఓటు బద్ధకం పోదా...ఈ నగరానికి ఏమైంది...?

ఓటు అన్నది వజ్రాయుధం అని అంతా చెబుతారు. ఆ ముక్క పల్లెలలో చెప్పనక్కరలేదు. వారు ఓట్ల పండుగనే చేసుకుంటారు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:44 AM GMT
ఓటు బద్ధకం పోదా...ఈ నగరానికి ఏమైంది...?
X

ఓటు అన్నది వజ్రాయుధం అని అంతా చెబుతారు. ఆ ముక్క పల్లెలలో చెప్పనక్కరలేదు. వారు ఓట్ల పండుగనే చేసుకుంటారు. అంతా కలసి క్యూలో వెళ్ళి మరీ ఓటేసి వస్తారు. పట్నాలకు పోయినా ఠంచనుగా పల్లెలకు పిల్లా పాపతో వెళ్ళి మరీ ఓటేస్తారు. మరి మహా నగరం అయిన హైదరాబాద్ లో సిటిజన్స్ పరిస్థితి ఏంటి అంతే ఓటు బద్ధకం నాటికీ పెరిగిపోతోంది అని అంటున్నారు.

పోలింగ్ రోజు వచ్చిందంటే చాలు దాన్ని సెలవుగా పరిగణిస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి. ఆ మధ్యన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినా ముప్పయి నుంచి ముప్పయి అయిదు శాతం మాత్రమే పోలింగ్ జరిగింది అని లెక్కలు చెప్పాలి. ఇపుడు చూస్తే 45 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది అని అంటున్నారు.

హైదారాబాద్ లో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నానటికీ తీసి కట్టు అన్నట్లుగా ఓటర్లు యమ బద్ధకస్తులు అయిపోతున్నారు. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2009 ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటింగ్ శాతం 58 శాతంగా ఉంటే అది 2014 నాటికి 53 శాతం అయింది. 2018 నాటికి కాస్తా 48 శాతంగా వచ్చింది. ఇపుడు చూస్తే ఏకంగా 45 శాతం అంటున్నారు.

హైదరాబాద్ లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారు 77 లక్షల మంది ఉన్నారు. మరి ఇందులో సగానికి సగం మంది అంటే 50 శాతం కూడా ఓట్లు ఎత్తలేదని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏ ముప్పయి లక్షల మందో ఓట్లు వేశారు అన్న మాట. మిగిలిన వారు మాత్రం అసలు పోలింగ్ బూతుల ముఖం చూడలేదు అంటున్నారు.

నిజానికి హైదరాబాద్ లో చాలా చోట్ల అందుబాటులో దగ్గరలోనే పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మరి హాయిగా వెళ్ళి ఓటు వేయవచ్చు కదా అని అంటున్న వారూ ఉన్నారు. తమకు ప్రభుత్వం నుంచి సదుపాయాలు కావాలి. ప్రజా సమస్యల మీద తెల్లారి లేస్తే లెక్చర్లు దంచే బాపతు కూడా ఎక్కువగానే ఉంటారు.

కానీ ఓట్లు వేసే సమయానికి మాత్రం ఎందుకో బద్ధకం ఆవరిస్తుంది. దాంతోనే ఇళ్లలోనే ఉండిపోతున్నారు అని అంటున్నారు. దీంతోనే ఓట్లు ఎందుకు వేయడంలేదు అని సినీ ప్రముఖులను ప్రశ్నించినా వారు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. బ్రహ్మానందాన్ని మీడియా ఇదే విషయం అడితే ఓట్లు వేయని వారిని ఓట్లు వేయని వారుగానే అనాలి మరో పేరు ఎందుకు అన్నట్లుగా మాట్లాడారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే తనదైన శైలిలో సెటైర్లు వేశారు కూడా.

ఎవరో అన్నారు ఎవరో చెప్పరని కాదు కానీ ఓట్లు వేయడం మన బాధ్యత అని గుర్తించినపుడే సమాజంలో మార్పు వస్తుంది అని మేధావులు అంటున్నారు. ప్రజాస్వాయం బతకాలీ అంటే ఓట్లు వేయాలని అంటున్నారు. అసలు ఓటు వేయడాన్ని కంపల్సరీ చేయాలని కూడా డిమాండ్ ఉంది. మరీ ఇంత బద్ధకమా అన్న వారే ఇపుడు కనిపిస్తున్నారు.