తప్పెవరిది పవన్.. నీ వల్ల మేం బలికావాలా?
అది కూడా కాపులు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కావడం గమనార్హం.
By: Tupaki Desk | 25 March 2024 5:30 PM GMTఅసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పొత్తులు, టికెట్ల కేటాయింపు వ్యవహారం వంటివి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారీ సెగ పెడుతున్నాయి. అది కూడా కాపులు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కావడం గమనార్హం. ''తప్పెవరిది పవన్?'' అంటూ నిలదీతలు తెరమీదికి వచ్చాయి. దీంతో ఇప్పుడు జనసేన ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పంతం సరోజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. విధానపరమైన అంశాలు, పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు? మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని, బూత్ మేనేజ్ మెంట్ లేదని, టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూ డెం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?`` అని సరోజ నిలదీశారు.
నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ, ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారని, మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ, బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారని సరోజ ప్రశ్నించారు. ``ఈ అంశంపై మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది? ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా. ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే, ఇది ఎవరి వైఫల్యం? ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి`` అని సరోజ నిప్పులు చెరిగారు.
ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది... పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అని ప్రశ్నించారు సరోజ. ''పార్టీని నమ్ముకున్న వారి భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే... ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు, సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?'' అని నిలదీశారు.