Begin typing your search above and press return to search.

కూటమి స‌ర్కారుపై డోర్ డెలివ‌రీ ఎఫెక్ట్ ఎంత‌.. ?

వైసీపీ హ‌యాంలో వ‌లంటీర్ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌మాచారం అందిన మాట వాస్త‌వం.

By:  Tupaki Desk   |   8 Dec 2024 10:30 PM GMT
కూటమి స‌ర్కారుపై డోర్ డెలివ‌రీ ఎఫెక్ట్ ఎంత‌.. ?
X

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌మ హ‌యాం గురించి మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు అన్నీ డోర్ డెలివ‌రీ చేశామ‌ని.. కానీ, ఇప్పుడు చేయ‌డం లేద‌ని.. వ్యాఖ్యానించారు. దీనిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంద ని.. జ‌గ‌న్‌ను వ‌దులుకుని త‌ప్పులు చేశామ‌ని.. ప్ర‌జ‌లు భావిస్తున్నామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో కూట‌మి స‌ర్కారు.. దాదాపు ఎత్తేసిన డోర్ డెలివ‌రీ విధానాల‌పై ఇప్పుడు మేధావులు సైతం దృష్టి పెట్టారు. నిజంగానే డోర్‌డెలివ‌రీ లేక‌పోతే.. వ్య‌తిరేకత పెరుగుతుందా? అనే ఆలోచ‌న చేస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో వ‌లంటీర్ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌మాచారం అందిన మాట వాస్త‌వం. దీనిని కూట‌మి నాయ‌కులు కూడా గ‌తంలో అంగీక‌రించారు. వ‌లంటీర్లు బాగానే ప‌నిచేస్తున్నార‌ని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వంటివారు గ‌తంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మైనా.. వ‌లంటీర్లు చేదోడుగా ఉన్నారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. వ‌లంటీర్ల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టేసింది. తీసుకుంటామ‌ని చెబుతున్నా ఆదిశ‌గా ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేదు.

ఇక‌, రేష‌న్ బియ్యాన్ని కూడా డోర్ డెలివ‌రీ చేసిన విష‌యాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌స్తుతం వాహ‌నా ల‌ను పూర్తిగా నిలిపి వేసి.. దుకాణాల‌కే ల‌బ్ధిదారుల‌ను పంపుతున్న విష‌యాన్ని ఆయ‌న చెబుతున్నారు. ఇది అంద‌రికీ తెలిసిందే. రేష‌న్ వాహ‌నాల కార‌ణంగా.. రేష‌న్ దుకాణాలు మూత‌బ‌డ్డాయ‌ని.. దీనివ‌ల్ల ఆయా దుకాణాల‌పై ఆధార‌ప‌డిన వారి కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌న్న‌ది ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌. అందుకే వాహ‌నాల‌ను తీసేశామ‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో ఇంటికే డాక్ట‌ర్ కాన్సెప్టును వైసీపీ అమ‌లు చేసింది. కానీ, ఇప్పుడు దానిని కూడా తీసేశార‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే.. జ‌గ‌న్ చెబుతున్న విష‌యాల్లో నిజం ఉన్న‌ప్ప‌టికీ. ప్ర‌జ‌లు ఇవేవీ కోరుకోవ‌డం లేద‌న్న‌ది సుస్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. రేష‌న్ అయినా.. ప‌థ‌క‌మైనా వారికి అందితే చాల‌ని కోరుతున్నారు. అంతేత‌ప్ప‌.. నేరుగా నోట్లో పెట్టిన‌ట్టు.. ఇంటికే అన్నింటినీ తీసుకురావాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న కూడా క‌నిపిస్తోంది. దీంతో డోర్ డెలివ‌రి ఫ‌థ‌కాల‌ను నిలిపివేసినా.. కూట‌మి స‌ర్కారుపై పెద్ద ప్ర‌భావం అయితే ప‌డే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.