మోడీ గ్యారెంటీలను జనాలు నమ్ముతారా ?
నరేంద్రమోడీ ప్రధానమంత్రి హోదాలో ఇవ్వబోయే గ్యారెంటీలనే ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోగా ప్రచారం చేసుకోబోతోంది.
By: Tupaki Desk | 15 Nov 2023 10:30 AM GMTనరేంద్రమోడీ ప్రధానమంత్రి హోదాలో ఇవ్వబోయే గ్యారెంటీలనే ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోగా ప్రచారం చేసుకోబోతోంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోను బీజేపీ ప్రత్యేకంగా మ్యానిఫెస్టో అని కాకుండా కొన్ని గ్యారెంటీలను ప్రకటించింది. తెలంగాణాలో కూడా అలాంటి గ్యారెంటీలను ఈనెల 17వ తేదీన ప్రకటించబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాకు రాబోతున్నారు. మోడీ గ్యారెంటీ పేరుతో చేసే ప్రకటననే పార్టీ మ్యానిఫెస్టోగా బీజేపీ అభ్యర్ధులు ప్రచారం చేసుకోవాలి.
అర్హులైన ప్రతి పేదవాడికి ఉచిత విద్య, వైద్యం, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, వరికి కనీస మద్దతును రు. 3100కి పెంచటం, ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రు. 5 లక్షలను రు. 10 లక్షలకు పెంచటం, వివాహం అయిన ప్రతి మహిళకు ఏడాదికి రు. 12 వేలు, రు.500కే సిలిండర్, తెలంగాణాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి హామీలు చాలానే ఇవ్వబోతున్నారు. విచిత్రం ఏమిటంటే సిలిండర్ ధరను ఒకవైపు వెయ్యిరూపాయాలు దాటించింది మోడీ ప్రభుత్వమే. మళ్ళీ ఎన్నికల్లో రు. 500 కే సిలిండర్ అని హామీ ఇవ్వబోతున్నదీ బీజేపీనే.
అలాగే వరికి మద్దతు ధరను రు. 3100కి ఇంతకాలం ఎవరు పెంచద్దన్నారు ? ఎందుకింత కాలం పెంచలేదు ? ఆయుష్మాన్ భారత్ మొత్తాన్ని రు. 5 లక్షల నుండి రు. 10 లక్షలకు ఇంతకాలం ఎందుకు పెంచలేదు ? ఎన్నికల సమయంలోనే పెంచాలని అనిపించిందా ? అనే సందేహం పెరిగిపోతోంది.
తన పరిధిలో చేయాల్సిన విషయాలను కూడా ఇంతకాలం గాలికి వదిలిపెట్టేసి ఇపుడు ఎన్నికల ముందు సడెన్ గా జనాలకు వరాలు ఇస్తామంటే ఎలాగ నమ్ముతారు ? ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకు ఏమాత్రం విలువుంటుందో జనాలకు అంతమాత్రం తెలీదా ? లేకపోతే ఎలాగూ గెలిచే అవకాశంలేదు కాబట్టి బుర్రకు తోచిన హామీలను మోడీ గ్యారెంటీల పేరుతో ఇచ్చేస్తే ఓ పనైపోతుందని అనుకుంటున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి మోడీ గ్యారెంటీలు రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.