Begin typing your search above and press return to search.

మోడీపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ?

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగటంతో బ్యారేజి కూడా కుంగింది. దీంతో ప్రతిపక్షాలన్నీ కేసీయార్ అవినీతిపై పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Nov 2023 3:30 PM GMT
మోడీపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ?
X

హైదరాబాద్ లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగించిన నరేంద్రమోడీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడీ ప్రసంగించిన విషయాలు ఎలాగున్నా ప్రస్తావించని అంశాలపైనే ఇపుడు జనాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య కీలకంగా చర్చ జరుగుతోంది మేడిగడ్డ బ్యారేజ్ పైనే. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగటంతో బ్యారేజి కూడా కుంగింది. దీంతో ప్రతిపక్షాలన్నీ కేసీయార్ అవినీతిపై పదేపదే ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.

ఇదే విషయంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తునే ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం కూడా కేసీయార్ ప్రభుత్వాన్నే తప్పుపట్టింది. నిజానికి ఈ అంశం ఎన్నికల్లో చాలా హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. అలాంటి అంశాన్ని మోడీ మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కూడా మోడీ పట్టించుకోలేదు.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపైన కూడా కిషన్ అండ్ కో పదేపదే ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మోడీ టచ్ చేయలేదు. అధికారంలోకి రాబోయేది తామే అని చెప్పుకున్న మోడీ మరి కేసీయార్ అవినీతిపైన ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే కాంగ్రెస్ ఆరోపణలకు బలం పెరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని చాలాకాలంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోడీ ప్రసంగం ఊతమిచ్చేట్లుగా ఉంది. ఈ ఆరోపణలతోనే బీజేపీ ఊపంతా పడిపోయింది. తాజాగా మోడీ పర్యటన కారణంగా బీజేపీ గ్రాఫ్ మరింతగా దిగజారిపోవటానికి కారణమవుతుందేమో. మోడీ, కేసీయార్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు నమ్మటానికి మోడీ అవకాశం ఇచ్చారు. ఇపుడు గనుక కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అని జనాలు నమ్మితే వస్తాయని అనుకుంటున్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి దెబ్బ తప్పదనే అనుమానాలు పెరిగిపోతోంది.