సీఈఓ గా పదేళ్లు... సత్య నాదేళ్ల జీతభత్యాల గురించి తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది.
By: Tupaki Desk | 9 Feb 2024 10:30 AM GMTభారత్ లో పుట్టి పెరిగి.. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థకు సీఈఓ గా ఉన్నారు సత్య నాదెళ్ల. ప్రపంచానికి ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లలో ఇది ఒకటి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది. ఈ కంపెనీ ఎం-క్యాప్ ఇటీవలే భారత కరెన్సీలో సుమారు రూ.255 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ స్థాయి సంస్థకు సీఈఓగా సత్యనాదెళ్ల ఇటీవలే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
అవును... 2014లో స్టీవ్ బామర్ నుంచి కంపెనీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న సత్య నాదెళ్ల ఇటీవలే సీఈఓ గా పదేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతలు, ఆయన అందుకుంటున్న జీతభత్యాలపై ఆసక్తి నెలకొంది. నాదెళ్ల సీఈఓగా చేరినప్పటి నుంచి గడిచిన పదేళ్లలో రికార్డు స్థాయిలో 1000 శాతానికి పైగా కంపెనీ విలువ పెరిగింది. అంటే... పదేళ్ల కిందట 10 వేల డాలర్లతో మైక్రోసాఫ్ట్ షేర్లు కొన్న వారి సంపద ఇప్పుడు 1,13,000 డాలర్లకు చేరిందన్నమాట!
ఈ స్థాయిలో కంపెనీని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాదెళ్ల... వార్షిక వేతనం ఎంత ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్నల్లో ఒకటి అనుకుంటే... 2023లో ఆయన తీసుకున్న జీతానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాధానం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ - 2023 రిపోర్ట్ ప్రకారం సత్య నాదెళ్లకు గత ఏడాది సుమారు 48,512,537 డాలర్ల వేతనం ఇచ్చినట్లు తెలుస్తుంది.
అంటే ఇది ఇండియన్ కరెన్సీలో సుమారు 402 కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నమాట. వామ్మో ఇంత వార్షిక వేతనమా అనుకోవద్దు సుమా. అంతకు ముందుటేడాది 2022తో పోలిస్తే ఇది తక్కువే! కారణం... 2022లో సత్య నాదెళ్ల సుమారు 55 మిలియన్ డాలర్ల జీతం తీసుకున్నారు. అంటే... భారత కరెన్సీలో దాని విలువ సుమారు రూ.456 కోట్లు అన్నమాట. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే నెలకు సుమారు 38 కోట్ల రూపాయలు!!
ఇదే సమయంలో... సత్య నాదెళ్లకు 2023 వరకు మైక్రోసాఫ్ట్ లో 8,00,667 షేర్లు ఉన్నాయని అంటున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి అయిన సత్యనాదెళ్ల... తనదైన పెర్ఫార్మెన్స్ తో దూసుకుపోతున్నారని అంటున్నారు. ఇక నాదెళ్లకంటే ముందు స్టీవ్ బామర్ సుమారు 14 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నారు. ఇక కంపెనీ కోఫౌండర్ గా ఉన్న బిల్ గేట్స్ అంతకుముందు సీఈఓగా ఉన్నారు.