ఎలక్షన్ స్పెషల్... డిపాజిట్ కోల్పోవడం అంటే తెలుసా?
ఇందులో భాగంగా... ఎన్నికల్లో డిపాజిట్ అంటే ఏమిటి.. ఆ నియమం ఎప్పటినుంచి వచ్చింది.. అది కోల్పోవడం అంటే ఏమిటి.. ఓటర్ దినోత్సవం, ఓటరు ప్రతిజ్ఞ మొదలైన విషయాలు ప్రధానంగా ఎన్నికల సీజన్ లో వినిపిస్తుంటాయి.
By: Tupaki Desk | 4 Nov 2023 1:30 AM GMTదేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలవ్వడంతో మరోసారి ఎన్నికల సీజన్ స్టార్టయ్యింది. ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం!
ఇందులో భాగంగా... ఎన్నికల్లో డిపాజిట్ అంటే ఏమిటి.. ఆ నియమం ఎప్పటినుంచి వచ్చింది.. అది కోల్పోవడం అంటే ఏమిటి.. ఓటర్ దినోత్సవం, ఓటరు ప్రతిజ్ఞ మొదలైన విషయాలు ప్రధానంగా ఎన్నికల సీజన్ లో వినిపిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా డిపాజిట్ కోల్పోవడం అనేది హాట్ టాపిక్ గా ఉంటుంటుంది.
ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తి నామినేషన్ పత్రం దాఖలు చేసేటప్పుడే 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 34(1)(ఎ) నిబంధన ప్రకారం కొంతమొత్తాన్ని డిపాజిట్ గా చెల్లించాల్సి వస్తుంది. ఇందులో భాగంగా... లోక్ సభకు పోటీ చేయాలనుకుంటే రూ.25వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది. అదే శాసనసభకు పోటీ చేయాలంటే సదరు అభ్యర్థి రూ.10వేలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీలు ఐదు వేలు చెల్లిస్తే చాలు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి.. పోలైన ఓట్లలో ఆరింట ఒక వంతు అంటే 16.6శాతం ఓట్లు సాధించగలిగితే ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. ఈ క్రమ్మలో ఎవరికైతే ఆరింట ఒక వంతు ఓట్లు కూడా రావో.. వారు డిపాజిట్ కోల్పోయినట్లు అర్థం! అలాంటి వారికి డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వరు. దాన్ని డిపాజిట్ జప్తు చేయడం అంటారు. నామినేషన్ ఉపసంహరించుకున్నా, గెలిచినా, ఆరింట ఒక వంతు ఓట్లు సాధించినా ఈ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు.
ఇదే క్రమంలో... పార్లమెంట్ ఎన్నికలకు రాష్ర్టపతి పేరుతో, రాష్ర్ట శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది.
ప్రతి ఏటా జనవరి 25ని ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీన్ని 2011 నుంచి ప్రారంభించారు. ఓటర్లను కలుపుకోవడం, వారిని మెరుగైన భాగస్వాములను చేయడం అనేది ఈ దోనోత్సవ లక్ష్యం. ఇక "ఓటర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను" అనేదాన్ని ఓటరు నినాదంగా ఉంది! ఇదే సమయంలో ఓటర్ల ప్రతిజ్ఞ కూడా మన ప్రజాస్వామ్యంలో పొందుపరచబడి ఉంది!
ఇందులో భాగంగా... "ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారతదేశ పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయ, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని.. ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, కులం, మతం, వర్గం, సంఘం, భాష మొదలైన ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా.. వాటికి ఏమాత్రం ప్రభావితం కాకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అనేది భారతదేశంలోని ఓటరు ప్రతిజ్ఞ!
అంటే... ఓటు వేసే ముందు ప్రతీ ఓటరూ ఈ నినాదాలను, ప్రతిజ్ఞను, ఓటు విలువను గుర్తెరిగి ఓటు వేయాలన్నమాట!