Begin typing your search above and press return to search.

‘గాడిద గుడ్డేం కాదు’ అనకండి.. మంచి యవ్వనం కావాలంటే!

ముఖ్యంగా గాడిద మాంసం తింటే మంచి యవ్వనం సొంతం అవుతుందని విశ్వసించేవారు పెరిగిపోయారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 9:08 AM GMT
‘గాడిద గుడ్డేం కాదు’ అనకండి.. మంచి యవ్వనం కావాలంటే!
X

ఒకప్పుడు గాడిద పాలు, గాడిద మాంసం అంటే అంతా ముఖాలు చిట్లించేవారు. ఎవరైనా గాడిద మాంసం తిన్నామని చెబితే వారిని ఒకింత అసహ్యంగా చూసేవారు. అయితే ఇప్పుడు గాడిద మాంసం, వాటి పాలకు ఉన్న డిమాండ్‌ తెలిశాక వీటికి ఎనలేని ప్రాధాన్యత పెరిగిపోయింది.

ముఖ్యంగా గాడిద మాంసం తింటే మంచి యవ్వనం సొంతం అవుతుందని విశ్వసించేవారు పెరిగిపోయారు. దీంతో గాడిద మాంసానికి ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడుతోంది. గాడిద మాంసం దొరికే చోటు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి వెళ్లిపోతున్నారు. తమకు అందుబాటులో లేకపోతే తమ బంధువులు, స్నేహితులకు చెప్పి గాడిద మాంసాన్ని వండించుకుని తెప్పించుకుంటున్నారు.

ఒక్క యవ్వనాన్ని మెరుగుపరిచే గుణాలే కాకుండా శరీరంలో పలు దీర్ఘకాలిక నొప్పులను, ఉబ్బసం, ఆస్తమా వ్యాధులను కూడా గాడిద మాంసం తింటే పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. దీంతో గాడిద మాంసానికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున గాడిదలను వధిస్తున్నారు.

ప్రపంచంలో దాదాపు 5 కోట్ల గాడిదలుంటాయని అంచనా. వీటిలో మూడింట రెండో వంతు ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. గాడిదల పెంపకంపైనే అక్కడి ప్రజలు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలకాలంలో గాడిదల దొంగతనం కేసులు భారీగా పెరిగిపోతున్నాయట. ఇలా దొంగతనం చేసిన గాడిదలను చైనాకు పెద్ద ఎత్తున అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నారు.

గాడిదల చర్మంలోని జెలటిన్‌ అనే పదార్థంతో చేసే ఔషధానికి చైనాలో చాలా డిమాండ్‌ ఉందని అంటున్నారు. ఈ ఔషధానికి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చైనాతోపాటు పలు దేశాల్లో 59 లక్షల గాడిదలను వధించారని అనధికార లెక్కలు పేర్కొంటున్నాయి.

మరోవైపు గాడిద పాలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ప్రపంచ సుందరిగా పేరుగాంచిన ఈజిఫ్ట్‌ మహారాణి క్లియోపాత్రా రోజు గాడిద పాలతోనే స్నానం చేసేదని చెప్పుకుంటారు. గాడిద పాల స్నానం వల్లే ఆమె ప్రపంచ సుందరి అయిందని అనేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారు. గాడిద పాలలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పదార్థాలు కూడా ఉన్నాయంటున్నారు.

గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని అంటున్నారు. అందువల్లే ఇటీవల కాలంలో గాడిద పాలకు ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడిందని పేర్కొంటున్నారు.

గాడిద పాలలో ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్‌–ఇ ఉంటుందని అంటున్నారు. చర్మం ముడుతలు కూడా దీనివల్ల తగ్గిపోతాయని చెబుతున్నారు.