సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ పెడ్లర్‌కు బెయిల్!
ఇప్పుడు సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేశారనే ఆరోపణలపై మూడేళ్ల క్రితం అరెస్టయిన అనుజ్ కేశ్వానికి బాంబే హైకోర్టు (హెచ్‌సి) శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
By: Tupaki Desk | 15 Nov 2023 3:15 AM GMTదివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో చిక్కు ముడి ఇంకా వీడలేదు. దీనిపై ఏళ్ల తరబడి కోర్టుల్లో విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. ఇప్పుడు సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేశారనే ఆరోపణలపై మూడేళ్ల క్రితం అరెస్టయిన అనుజ్ కేశ్వానికి బాంబే హైకోర్టు (హెచ్‌సి) శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
14 జూన్ 2020న దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో చనిపోయినట్లు గుర్తించిన తర్వాత 2020 నుండి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఖార్ నివాసి కేశ్వాని (31) సెప్టెంబర్ 2020లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టయ్యాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అతడి స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి సహా సన్నిహితులు డ్రగ్స్ సరఫరా చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర నార్కోటిక్స్ ఏజెన్సీ విస్తృతంగా దర్యాప్తు జరిపింది. 28 ఆగస్ట్ 2020 న, NCB ముంబై జోనల్ యూనిట్ నేరాన్ని నమోదు చేసింది. రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోక్ సహా 36 మందిని అరెస్టు చేసింది.
విచారణలో NCB 585 గ్రాముల హషీష్, 0.62 గ్రాముల LSD షీట్లు, దిగుమతి చేసుకున్న గంజాయి జాయింట్‌లు, క్యాప్సూల్స్ సహా 270 గ్రాముల గంజాయి, 1.85 లక్షల నగదు, కొంత ఇండోనేషియా కరెన్సీని దర్యాప్తులో అధికారులు కనుగొన్నారు. ప్రత్యేక ఎన్‌డిపిఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో కేశ్వానీ ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైకోర్టును ఆశ్రయించాడు. ప్రాసిక్యూషన్ మొత్తం 160 మంది సాక్షులను ఉదహరించడమే గాక, అతడు ఇప్పటికే మూడు సంవత్సరాలు కటకటాల వెనుక గడిపాడని ప్రాథమికంగా వాదించారు. ఎన్‌డిపిఎస్ చట్టం 1985లోని కొన్ని తప్పనిసరి నిబంధనలను పాటించకపోవడాన్ని ఎత్తిచూపడమే కాకుండా, కేశ్వాని మినహా మిగిలిన నిందితులందరికీ బెయిల్ మంజూరయ్యిందని అతని తరపు న్యాయవాది అయాజ్ ఖాన్ వాదించారు.
NCB అతడి బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, అతడు వాణిజ్య పరిమాణంలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడని, అందువల్ల NDPS చట్టంలోని సెక్షన్ 37లో ఉన్న కాఠిన్యం దృష్ట్యా, నిందితుడికి బెయిల్ మంజూరు చేయలేమని వాదించింది. అంతేకాకుండ స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం (1976) ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటున్నామని ఏజెన్సీ పేర్కొంది.
కానీ ఇప్పటి విచారణ అనంతరం జస్టిస్ మకరంద్ కార్నిక్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ప్రధానంగా 16 డిసెంబర్ 2022 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కేశ్వానికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరొక నిందితుడు జితేంద్ర జైన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై సమానంగా ఎన్సీబీ నుంచి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ``ప్రస్తుత దరఖాస్తుదారుపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. అయితే గౌరవనీయ సుప్రీంకోర్టు 16/12/2022 నాటి ఉత్తర్వును దృష్టిలో ఉంచుకుని అతడికి బెయిల్ ఇస్తోంది``అని జస్టిస్ కార్నిక్ అన్నారు. ``దరఖాస్తుదారుడు 3 సంవత్సరాలకు పైగా కస్టడీలో ఉన్నాడు... విచారణ ముగియడానికి చాలా సమయం పడుతుంది`` అని వ్యాఖ్యానించిన కోర్టు కేశ్వానిని రూ.1లక్ష వ్యక్తిగత బాండ్, ఒకరు లేదా ఇద్దరు పూచీకత్తుతో విడుదల చేయాలని ఆదేశించింది.