ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్.. అప్పటి భగ్నప్రేమికుడు.. ఇప్పటికి డ్రగ్ పెడ్లర్!
వీరి నుంచి 42 ఎక్స్ టసీ పిల్స్ నుస్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన యువకుడు ఒకడు హైదరాబాద్ లో గడిచిన కొన్నేళ్లుగా ఉంటున్నాడు.
By: Tupaki Desk | 19 Dec 2023 10:30 AM GMTహైదరాబాద్ మహానగరంలో అత్యంత బిజీగా ఉండే ఎస్ఆర్ నగర్ లోని ఒక సర్వీసు అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ కు అలవాటు పడ్డ పెద్ద ముఠాను టీఎస్ న్యాబ్ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 42 ఎక్స్ టసీ పిల్స్ నుస్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన యువకుడు ఒకడు హైదరాబాద్ లో గడిచిన కొన్నేళ్లుగా ఉంటున్నాడు. ప్రేమలో ఫెయిల్ అయి.. ఆ డిప్రెషన్ లో మాదకద్రవ్యాలకు అలవాటు పడి.. ఆపై దాన్నే వ్యాపారంగా మార్చుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
స్నేహితుడి సలహాతో డ్రగ్ సరఫరాదారుగా మారి.. నెల్లూరు.. చుట్టుపక్కలకు చెందిన వారికి అతగాడు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న వైనాన్ని గుర్తించారు. వీరంతా ఐటీ ఉద్యోగులు.. ఇంజనీర్లు.. డాక్టర్లు కూడా కావటం గమనార్హం. వీరంతా హైదరాబాద్ లోనే ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంలో పద్నాలుగు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని ఫతేనగర్ కు చెందిన ఆషిక్ యాదవ్.. బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో పని చేసేవాడు. బీటెక్ చదివే రోజుల్లో ఇన్ స్టా ద్వారా ఒక అమ్మాయి పరిచయమైంది.
ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు ఆమె రావటంతో ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. అనంతరం ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో వారి రిలేషన్ బ్రేకప్ అయ్యింది. దీంతో డిప్రెషన్ కు వెళ్లిన ఆషిక్.. డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. బెంగళూరు.. గోవాలకు చెందిన డ్రగ్స్ సప్లయిర్స్ నుంచి మాదక ద్రవ్యాల్నికొనుగోలు చేసి.. వాటిని వాడేవాడు. గత డిసెంబరులో అతను హైదరాబాద్ కు షిఫ్టు అయ్యాడు. ఒక కంపెనీలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్న ఆషిక్.. తనకు వచ్చే జీతం సరిపోని పరిస్థితి. దీంతో ఆ జాబ్ వదిలేసి.. వేరే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన అతని క్లాస్ మేట్ రాజేశ్ ఆగస్టులో హైదరాబాద్ కు వచ్చాడు. ఇతనికి డ్రగ్స్ అలవాటు ఉంది. ఆషిక్ నుంచి సరుకు తీసుకునే రాజేష్.. హైదరాబాద్ సిటీలో మాదకద్రవ్యాలకు ఉన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ.. తామే ఆ దందా చేద్దామని.. మార్కెట్ లో ఎక్స్ టసీ పిల్స్ కు మంచి డిమాండ్ ఉందని.. వాటిని తామే తీసుకొచ్చి అమ్ముదామని పేర్కొన్నాడు. దీంతో వారు గోవా.. బెంగళూరుకు చెందిన వారి నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చేవారు.
హైదరాబాద్ లో ఉన్న నెల్లూరు.. ఆ చుట్టుపక్కల ఊళ్లకు చెందిన వారికి గుట్టు చప్పుడు కాకుండా ఎక్స్ టసీ పిల్ ను అమ్మేవాడు. వెయ్యి రూపాయిలకు కొనుగోలు చేసి.. మూడు వేలకు అమ్మేవాడు. మంగళవారం గోవాకు వెళ్లిన ఆషిక్ 60 పిల్స్ ను కొనుగోలు చేశాడు. నగరానికి వచ్చిన ఆషిక్ వాటిని రాజేశ్ కు అందజేశాడు.అందులోని రెండు పిల్స్ ను ఆషిక్ కు ఇచ్చిన రాజేశ్.. వాటిని కస్టమర్లకు డెలివరీ చేయాలని చెప్పాడు. అమీర్ పేటలోని మైత్రీవనం వద్ద ఆషిక్ ను పోలీసులు పట్టుకొని అతడి వద్ద ఉన్న రెండు పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం అతడ్ని విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారంతో ఎస్ఆర్ నగర్ లోని సర్వీసు అపార్టుమెంట్లో రాజేశ్ తో పాటు మరో పన్నెండు మంది దొరికారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. వీరినుంచి నలభై వరకు పిల్స్ ను స్వాధీనం చేసుకున్న టీఎస్ న్యాబ్ టీం.. వారిని అదుపులోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఒక బర్త్ డే పార్టీతో పాటు న్యూఇయర్ వేడుకలకు వీరి నుంచి కొనేందుకు కొందరు సిద్ధమైనట్లు చెబుతున్నారు. అంతేకాదు.. రాజేశ్ .. ఆషిక్ నుంచి రెగ్యులర్ గా కొనే వారు దాదాపు అరవై మంది వరకు కస్టమర్లుఉన్నట్లుగా గుర్తించారు. తాజాగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఐటీ ఉద్యోగులు.. డాక్టర్లు.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్లుగా తేలింది.ఈ స్థాయిలో డ్రగ్స్ వినియోగంపై పోలీసు వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.