Begin typing your search above and press return to search.

నా భార్యను చంపేశా సార్.. పరుగులు తీసిన పోలీసులకు షాక్

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక వ్యక్తి.. తాను తన భార్యను చంపేశానని.. లొంగిపోయేందుకు వచ్చినట్లుగా చెప్పటంతో ఒక్కసారిగా అలెర్టు అయ్యారు సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ పోలీసులు.

By:  Tupaki Desk   |   6 March 2025 12:33 PM IST
నా భార్యను చంపేశా సార్.. పరుగులు తీసిన పోలీసులకు షాక్
X

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక వ్యక్తి.. తాను తన భార్యను చంపేశానని.. లొంగిపోయేందుకు వచ్చినట్లుగా చెప్పటంతో ఒక్కసారిగా అలెర్టు అయ్యారు సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ పోలీసులు. తన భార్యను కత్తితో పొడిచి చంపేశానని చెప్పారు. ఇటీవల కాలంలో పెరిగిన దారుణాల నేపథ్యంలో సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సిబ్బందితో కలిసి సదరు వ్యక్తి చెప్పిన గ్రామానికి హడావుడిగా వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది.

సదరు వ్యక్తి చెప్పిన చోట అతడి భార్య క్షేమంగా ఉండటంతో ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తి తాగిన మైకంలో పోలీసుస్టేషన్ కు వచ్చి చేసిన రచ్చకు పోలీసులు అవాక్కు అయ్యారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వింత ఘటనలో బద్యానాయక్ అనే మందుబాబు పోలీసుల్ని ఈ తీరులో బురిడి కొట్టించాడు.

మద్యానికి బానిసైన అతడు తన భార్య చాందిబాయితో నిత్యం గొడవ పడుతూ ఉంటాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఉదయం నిద్ర లేచేసరికి ఇంట్లో భార్య లేకపోవటంతో ఆమె తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని భయపడ్డాడు. ఆ వెంటనే మరింత తాగాడు. ఆమత్తులో కల్హేర్ పోలీస్ స్టేష్ కు వెళ్లి ఎస్ఐ వెంకటేశం ముందు నిలబడి తాను తన భార్యను కత్తితో పొడిచి చంపినట్లుగా పేర్కొన్నాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు తండాకు వెళ్లి.. ఆమె గురించి వాకబు చేశారు. అక్కడి అంగన్ వాడీ కేంద్రం పక్కన చాందిబాయి నిద్రపోతోంది. ఆమె క్షేమంగా ఉండటంతో అసలు విషయాన్ని గుర్తించిన పోలీసులు వెనక్కి తిరిగారు. తమను ఆటపట్టించిన బద్యా నాయక్ కు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపేశారు. అసలు ట్విస్టు ఏమంటే.. తన భార్యను చంపేసినట్లు చెబితే వారే వెతికి తీసుకొస్తారన్న అతి తెలివితో ఈ అతి పని చేశారని పోలీసులు గుర్తించారు.