పుల్ గా తాగేసిన అమెరికన్ జంట ఈఫిల్ టవర్ మీద ఏం చేశారంటే?
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ పైకి ఎక్కిన ఒక అమెరికన్ జంట చేసిన పనికి.. అక్కడి అధికారులు అవాక్కు కావటమే కాదు.. ఆగమాగమైన పరిస్థితి
By: Tupaki Desk | 16 Aug 2023 4:44 AM GMTప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ పైకి ఎక్కిన ఒక అమెరికన్ జంట చేసిన పనికి.. అక్కడి అధికారులు అవాక్కు కావటమే కాదు.. ఆగమాగమైన పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈఫిల్ టవర్ ను చూసేందుకు వచ్చిన ఈ అమెరికన్ జంట.. ఫుల్ గా తాగేశారు. ఆ తర్వాత కిందకు దిగలేని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కళ్లు కప్పిన ఈ జంట.. రాత్రంతా ఈఫిల్ టవర్ పై భాగంలో ఉన్న ఉదంతం సంచలనంగా మారింది.
ఉదయాన్నే ఈఫిల్ టవర్ నిర్వహణ కార్యకలాపాలు చూసే సిబ్బంది తనిఖీల్లో ఈ జంట మాంచి నిద్రలో ఉండటంతో అవాక్కు అయ్యారు. ఆ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. టవర్ పైన ఉన్న భాగంలో ఉండిపోయిన వీరిని.. బయటకు జాగ్రత్తగా తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. పర్యాటకుల కోసం ఉదయం తొమ్మిది గంటకు తెరిచే ఈఫిల్ టవర్.. అర్థరాత్రి వరకు టూరిస్టులను అనుమతిస్తుంటారు.
ఆగస్టు 13 రాత్రి అమెరికన్ జంట రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో టికెట్లు కొనుక్కొని ఈఫిల్ టవర్ పైకి ఎక్కారు. టవర్ మూసి వేత సమయానికి భద్రతా సిబ్బంది కళ్లు కప్పారు. పర్యాటకులంతా కిందకు వచ్చేసినట్లుగా సిబ్బంది భావించినా.. ఈ అమెరికన్ జంట మాత్రం టవర్ పై భాగానికి చేరుకున్నారు. నిజానికి ఈ ప్రాంతానికి వెళ్లటం నిషిద్ధం. అనుమతి లేకున్నా.. వీరు అక్కడకు చేరుకున్నారు. టవర్ లో ఎత్తైన రెండు.. మూడు లెవల్స్ మధ్య ప్రాంతానికి చేరుకున్న వారు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు.
దీంతో.. వారు కిందకు రాలేకపోయారు. దీంతో.. రాతంత్రా అక్కడే ఉండిపోయారు. మత్తులో ఆదమరచి నిద్రపోయారు. ఉదయాన్నే వీరిని గమనించిన సిబ్బంది.. వీరిని రెస్క్యూ చేసి.. కిందకుదించి.. ప్యారిస్ లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు పెట్టి విచారిస్తున్నారు. దీంతో.. ఆగస్టు 14న ఈఫిల్ టవర్ సందర్శనను గంట ఆలస్యంగా అనుమతిచ్చారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏమంటే.. సరిగ్గా రోజు ముందే.. ఈఫిల్ టవర్ కు బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయటంతో.. అప్రమత్తమైన సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి.. ఏమీ లేదని తేల్చారు. ఇది జరిగిన రోజుకే ఈ ఉదంతం చోటు చేసుకోవటంతో సిబ్బంది హైరానా పడ్డారు.