మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు.. ఇప్పుడు ఎక్కడంటే?
మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన ఇంట్లో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By: Tupaki Desk | 13 March 2024 3:56 AM GMTతెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ సర్కారులో నాటి విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇందుకు తగ్గట్లే మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకోగా.. అర్థరాత్రి వేళలో ఆయన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన ఇంట్లో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికప్పుడు ఆయన్ను హైదరాబాద్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యేకంగా రెండు రూంలు కేటాయించటం.. పెద్ద ఎత్తున సాంకేతిక పరికరాల్ని ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే పెద్ద ఎత్తున హార్డు డిస్కుల్ని ధ్వంసం చేసినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్ ఐబీ లాగర్ రూంలో హార్డు డిస్కుల్ని ధ్వంసం చేసిన ఉదంతంలో ప్రణీత్ రావు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.
గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్ బీలో రిపోర్టు చేసిన ఆయన.. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లుగా చెబుతారు. ఆయనపై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. సస్పెన్షన్ లో భాగంగా సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ ను విడిచి పెట్టి వెళ్లొద్దని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తేలింది.
ఈ క్రమంలో ప్రణీత్ రావు మీద నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆయన్ను ఆయన ఇంట్లోనే మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సెల్ ఫోన్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు అర్థరాత్రి సమయానికి తీసుకొచ్చారు.
ఈ రోజు (బుధవారం) ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే వీలుందని చెబుతున్నారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పెను సంచనాలు చోటు చేసుకుంటాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.