Begin typing your search above and press return to search.

దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారికి ఇదో గుడ్ న్యూస్

చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ఓ సదావకాశాన్ని ఇచ్చింది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:50 AM GMT
దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారికి ఇదో గుడ్ న్యూస్
X

భారత్ నుంచి లక్షలాది మంది దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఉపాధి పొందుతున్నారు. అయితే.. వారిలో కొందరికి ఏజెంటు మోసాలు కావచ్చు.. అవగాహన రాహిత్యం కావచ్చు.. తమ వీసాల గడువు ముగిసినా ఇంకా అక్కడే ఉండిపోయారు. చాటుమాటున తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి UAE ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ఓ సదావకాశాన్ని ఇచ్చింది.

తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారి కోసం దుబాయ్ ప్రభుత్వం నిన్నటి నుంచి రెండు నెలల వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బాధితులు తమ వీసాను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు దొరికింది. ఆమ్నెస్టీ చేసుకున్నాక ఎలాంటి జరిమానాలు లేకుండానే వారు దేశం విడిచి వెళ్లచ్చు. వారితోపాటే దుబాయ్ దేశంలో జన్మించి సరైన పత్రాలు లేని వారికి కూడా దీనిని వర్తింపజేస్తున్నారు.

యూఏఈ జనాభాలో దాదాపు 30శాతం మంది జనాభా భారతీయులే ఉన్నారు. దాదాపు అక్కడ 35 లక్షల మంది మన వాళ్లు ఉన్నారు. ప్రధానంగా దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల్లో వివిధ ఉపాధి పొందుతున్నారు. అయితే.. చాలా మంది అక్రమంగా ఉంటున్నారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అక్కడి మన రాయబార కార్యాలయం ఓ అడ్వైజరీని సైతం జారీ చేసింది.

- ఏదేని కారణంతో దుబాయ్‌లో అక్రమంగా ఉండిపోయి భారత్‌కు వెళ్లాలనుకునే వారు మాత్రం వారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తమ వీసాను క్రమబద్ధీకరించుకోవాలంటే టెంపరరీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ఉచితంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మన వాళ్లు ఇబ్బంది పడకుండా మన రాయబార కార్యాలయం, అవిర్ ఇమ్మిగ్రేషన్ సెంటర్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల సాయంత్రం 4 గంటల మధ్య భారత రాయబార కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలలోపు 050-9433111 మొబైల్ నంబర్‌లోనూ సంప్రదించవచ్చని అక్కడి రాయబార కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. హెల్ప్ లైన్ నంబర్‌ను సైతం ఏర్పాటు చేశారు. 800-46342 నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందని చెప్పింది.

- వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అమలవుతున్న సమయంలో ఈ సమాచార కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

- ఈ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం కాగా.. రెండు నెలల పాటు కొనసాగుతుంది.