Begin typing your search above and press return to search.

దుబ్బాకలో ఎవరిదో గెలుపు కేక?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి ఫోకస్ ను మళ్లించుకున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. ఈ సారి ఇక్కడ ఎవరి జెండా ఎగురుతుందనే ఆసక్తి నెలకొంది

By:  Tupaki Desk   |   27 Nov 2023 12:30 AM GMT
దుబ్బాకలో ఎవరిదో గెలుపు కేక?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి ఫోకస్ ను మళ్లించుకున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. ఈ సారి ఇక్కడ ఎవరి జెండా ఎగురుతుందనే ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సమరానికి సై అంటున్నారు. మరి దుబ్బాక గడ్డపై గెలుపు కేక పెట్టేది ఎవరో చూడాలి.

దుబ్బాకలో ఇప్పటివరకూ మూడు పార్టీలు అధికారంలో కొనసాగాయి. 2009లో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014, 2018లో సోలిపేట రామలింగారెడ్డి బీఆర్ఎస్ నుంచి విజయాలు సాధించారు. కానీ 2020లో రామలింగారెడ్డి చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రఘునందన్ రావు గెలిచారు. ఇప్పుడు గెలుపు కోసం రఘునందన్ రావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని రఘునందన్ పట్టుదలతో ఉన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న డెవలప్ మెంట్ ను, రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో రఘునందన్ సాగిపోతున్నారు.

ఇక దుబ్బాకను తిరిగి దక్కించుకోవాలనే ధ్యేయంతో బీఆర్ఎస్ ఉంది. అందుకే ఈ సారి ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డిని బరిలో దించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కేసీఆర్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభాకర్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక 2020 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అనుకూలంగా మారుతున్న పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ విజయం కోసం పాటుపడుతున్నారు. మార్పు కావాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని చెబుతున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.