ఓటర్లకు ప్రలోభాలు : దేవతా వస్త్రాల కధను గుర్తు చేస్తున్నాయా ?
దాంతో జనాలు అంతా తమకు దేవతా వస్త్రాలు కనిపిస్తున్నాయని బయటకు చెబుతూ పుణ్యాత్ముల జాబితాలో చేరిపోయారు.
By: Tupaki Desk | 12 May 2024 1:30 AM GMTపూర్వం ఒక రాజు గారు ఉండేవారు. ఆయనకు పండితుల మీద విపరీతమైన నమ్మకం. వారు చెప్పినది తడవు నగ్నంగా జనంలోకి వచ్చి ఊరేగారు. రాజు గారి వంటి మీద దేవతా వస్త్రాలు ఉన్నాయని పండితులు చెప్పుకుంటూ సాగారు. అవి కనిపించిన వారే పుణ్యాత్ములు లేని వారు పాపాత్ములు అని కలరింగ్ ఇచ్చారు. దాంతో జనాలు అంతా తమకు దేవతా వస్త్రాలు కనిపిస్తున్నాయని బయటకు చెబుతూ పుణ్యాత్ముల జాబితాలో చేరిపోయారు. కనబడలేదు అంటే ఎక్కడ పాపిగా లెక్క కడతారో అన్నది భయం.
ఇపుడు చూస్తే ప్రలోభాలు వాటి వెనక కధను చూస్తే అలాగే పరిస్థితి ఉంది అని మేధావులు అంటున్నారు. ప్రలోభాలు ఎక్కడా లేవు అని అంతా అనుకుంటున్నారు. అనుకోవాల్సిందే మరి. ఎవరికి వారుగా తాయిలాలు పుచ్చేసుకుని గప్ చుప్ అయిపోతున్నారు. ఈ విషయంలో మాత్రం అంతా రాజీ పడుతున్నారు.
పార్టీలు వేరు అయినా ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటున్నారు. అలా ప్రచారాలు ముగిసి ప్రలోభాలకు ఏపీలో తెర లేచింది. అందరికీ తెలుసు. డబ్బుల పంపకం ఒక లెవెల్ లో జోరుగా సాగుతోంది అని. కానీ బయటకు మాత్రం ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే తమ లాభం పోతుందని.
అలాగే ఫలానా వీధికి వచ్చారు మా వైపు ఎపుడు వస్తారు అని డిమాండ్ చేసే స్థాయిలోకి జనాలు వెళ్ళిపోయాక ఇంటి దొంగలను పట్టుకోవడం ఈశ్వరుడి వల్లనైనా అవుతుందా అన్నదే ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ ప్రలోభాలు కూడా కాలనుగుణంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ ఆసరాతో అవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
పుచ్చుకున్న వాడికీ ఇచ్చేవాడికీ ఈ ఇద్దరికే తెలిసే విధంగా పంపకాలు సాగుతున్నాయి. సిటీలకు సిటీలే కదిలి పల్లెలకు వస్తున్నాయి. మెగా నగరాలు అన్నీ ఖాళీ చేస్తూ తమ సొంత ప్రాంతానికి వస్తున్నాయి. వీటి వెనకాల ఓటు వేయాలన్న బలమైన ఆకాంక్షను ఎవరూ తోసిపారేయలేరు. అదే టైం లో అటూ ఇటూ దారి ఖర్చులతో పాటు అన్ని విధాలుగా పెట్టుబడులు పెడుతూ రప్పించుకునే వారు కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది.
రాచ మర్యాదతో రప్పించుకుంటున్న బాపతు కూడా ఎక్కువగా ఉంది అనీ అంటున్నారు. పుట్టింటికి రా చెల్లి. రా సోదరా అంటూ పిలుస్తూ రాజకీయ పబ్బాలు గడుపుకునే బాపతు వీటి వెనక సంధాన కర్తలుగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఓటు విలువను ఎరిగి మరీ శ్రమదమాదులకు ఓర్చి బయట ప్రాంతాల నుంచి వస్తున్న వారు చాలా మందే ఉంటున్నారు అని అంటున్నారు.
ఇలా ప్రలోభాల పర్వం ఎన్నికల ప్రజాస్వామ్య భారతంలో వెలుగొందుతోంది అని అంటున్నారు. అందరికీ అన్నీ తెలుసు. కానీ ఎవరూ కిక్కురుమనరు అన్నదే వేదన రోదన. ఇక ఇక్కడ కొసమెరుపు ఏమిటి అంటే దిగువ స్థాయి వర్గాలకే ఎక్కువగా తాయిలాలు అందుతున్నాయని మధ్యతరగతి జీవుల బాధ.
ఎటూ ప్రభుత్వాలు పట్టించుకోవు. మరి ఇంతటి వెల్లువలా సాగుతున్న ధన ప్రవాహంలో ప్రలోభాల జోరులో కూడా తమ ఊసు తల్లెత్తరేంటి అని ఘోషించే వారు అచ్చమైన మిడిల్ క్లాస్ వారే. ఇస్తే తీసుకోవాలని ఉంటుంది. కానీ ఆ ఏరియాలను ఎవరూ టచ్ చేయరు. అందుకే ఈ బాపతు జనాలు అంతా నిజాయతీ నీతి అని ప్రవచిస్తూంటారు కొందరైతే ఏమీ లేని దానికి ఎందుకు పోలింగ్ బూత్ దాకా క్యూ కట్టడం అని బద్ధకమూ చేస్తూంటారు. మొత్తానికి ఎన్నికలు అంటే చాలా మంది కలకు తీర్చే అతి పెద్ద ప్రక్రియగా చెప్పుకోవాల్సి ఉంటుంది అన్న మాట.