'దుర్గమ్మ దేవత కాదు.. ఆమెకు మహిషాసురుడిని చంపే శక్తీ లేదు'!
ఇక, శక్తిస్వరూపిణిగా అమ్మలగన్న అమ్మగా అశేష భక్త నీరాజనం అందుకునే దుర్గమ్మపైనా బహదూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 28 Oct 2023 6:05 AM GMT''దుర్గమ్మ దేవత కాదు.. ఆమెకు మహిషాసురుడిని చంపే శక్తీ లేదు. అసలు ఆమె కల్పిత పాత్ర. పుక్కిటి పురాణాలు.. ఆమెను కల్పించాయి. ఇది ఊహాజనిత పాత్రగా భావించాలి. దుర్గమ్మ అసలు లేనే లేదు'' అని బిహార్‌కు చెందిన అధికార పక్షం ఆర్జేడీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. సనాతన ధర్మాన్ని ఆర్జేడీ రోడ్డు పాలు చేస్తోందని.. హిందువలన్నా... వారి దేవతా మూర్తులన్నా.. కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని బీజేపీ అప్పుడే దేశవ్యాప్త ప్రచారం చేసేస్తోంది.
తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిహార్‌లో జరుగుతున్న నవరాత్రులను ఉద్దేశించి అధికార పక్షం ఆర్జేడీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అయితే, ఆయన ఈ సందర్భంగా రెచ్చిపోవడమే చర్చకు, వివాదానికి కూడా దారితీసింది.
బహదూర్ ఏమన్నారంటే!
''`కొందరు పురాణ ప్రవచన కర్తలు చెబుతున్నట్టు.. హిందువులకు 33 కోట్ల మంది దేవీదేవతలు ఉన్నారని అనుకుందాం. అయితే, వీరంతా తిని కూర్చుంటున్నారా? అనే సందేహం నాకుంది. ఎందుకంటే.. బ్రిటీష్ వారు మన దేశాన్ని దోచుకున్నప్పుడు.. దాడులు చేసినప్పుడు.. మనల్ని బానిసలుగా మార్చినప్పుడు.. మన దేశంలో జనాభా 30 కోట్ల మంది మాత్రమే. మరి దేవీ దేవతలు.. జనాభా కన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా? వారు వచ్చి.. బ్రిటీష్ పాలన నుంచి ఈ దేశ ప్రజలను రక్షించొచ్చుకదా! కానీ, వారంతా ట్రాష్. లేరు'' అని అన్నారు.
ఇక, శక్తిస్వరూపిణిగా అమ్మలగన్న అమ్మగా అశేష భక్త నీరాజనం అందుకునే దుర్గమ్మపైనా బహదూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''దుర్గమ్మ అనే దేవి లేదు. ఎవరో కల్పించిన కథలో ఊహాజనిత పాత్ర పేరే దుర్గ. నిజానికి ఆమె ఉండి ఉంటే.. కొన్ని కోట్ల మంది సైన్యం ఉన్న మహిషాసురుడిని సైతం ఆమె ఒక్క వేటుకే తెగనరికి ఉంటే.. బ్రిటీష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి ఎందుకు కల్పించలేదు. ఆ సమయంలో ఆమె ఎక్కడుంది? ఏం చేసింది? దేవీ నవరాత్రుల పేరుతో సొమ్ములు ఖర్చు చేయడం వృథా'' అని అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే బహదూర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మంపై రాజకీయాలు చేసేందుకు బీజేపీ నాయకులు రెడీ అయిపోయారు. ఇదిలావుంటే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఊపు తెచ్చేలా.. కొన్ని అతీతశక్తులు పనిచేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీని విభేదిస్తున్న కొన్ని పార్టీలు.. లోపాయికారీగా ఏదో ఒక రగడ సృష్టించి బీజేపీకి మేలు చేసేలా చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.