Begin typing your search above and press return to search.

కలిసొస్తున్న నిడదవోలు : దుర్గేష్ గెలిస్తే మంత్రి గ్యారంటీ...!

ఆయన గెలిస్తే కచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఈ వార్తతో జనసేన వర్గాలు ఖుషీ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   7 March 2024 3:51 AM GMT
కలిసొస్తున్న నిడదవోలు  : దుర్గేష్ గెలిస్తే మంత్రి గ్యారంటీ...!
X

తూర్పు గోదావరిలో టీడీపీ జనసేన పొత్తు సంఘర్షణ వీడి సహకారం దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి రూరల్ టికెట్ కోసం పట్టుబట్టిన జనసేన జిల్లా ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ కి నిడదవోలుని కేటాయించారు. దానికి కారణం సీనియర్ నేత పెద్దాయన అని గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఈ ఎన్నికలు లాస్ట్ చాన్స్ గా మారాయి. దాంతో ఆయన మీద గౌరవంతో ఈసారికి నిడదవోలుకు దుర్గేష్ ని పంపుతున్నారు.

అయితే నిడదవోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మొదట్లో కొంత అయిష్టత వ్యక్తం చేసినా ఇపుడు దుర్గేష్ కి మద్దతుగా టీడీపీ ముందుకు కదులుతోంది. ఇక నిడదవోలు నుంచి శేషారావు 2009, 2014లలో రెండు సార్లు గెలిచారు. ఆయనకు మంచి అనుచర గణం ఉంది. 2019 ఎన్నికల్లో చూస్తే కనుక శేషారావుకు 59 వేల పై చిలుకు ఓట్లు దక్కాయి. అలాగే జనసేన అభ్యర్ధికి 23 వేల ఓట్ల దాకా వచ్చాయి. వైసీపీకి 81 వేల ఓట్లు పై చిలుకు వచ్చాయి. 21 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.

ఇపుడు జనసేన టీడీపీ కలిస్తే వైసీపీని ఓడించగలమని భావిస్తున్నారు. పైగా దుర్గేష్ కి ఒక కచ్చితమైన హామీతో నిడదవోలుకు పంపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన గెలిస్తే కచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఈ వార్తతో జనసేన వర్గాలు ఖుషీ అవుతున్నాయి.

కందుల దుర్గేష్ కోసం రాజమండ్రి రూరల్ నుంచి కూడా క్యాడర్ నిడదవోలు వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అలాగే శేషారావు కూడా తన మద్దతుని జనసేన గెలుపు కోసం పూర్తిగా ఇస్తున్నారు. ఈ పరిణామాలు రెండు పార్టీలలో ఆనందం కలిగిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక ఓట్ల బదిలీ అన్నది సాఫీగా సాగేలా ఈ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే కందుల దుర్గేష్ నియోజకవర్గం మారి వెళ్ళడం పట్ల రెండు పార్టీలలో ఆయనకు సింపతీ అయితే మరింతగా పెరిగింది. అది కూడా ఆయన విజయానికి మరో కీలక పరిణామం కాబోతుందని అంటున్నారు. దుర్గేష్ స్వతహాగా సౌమ్యుడు మంచి మనిషి కావడం ఆయనకు ఉన్న మరో ప్లస్ పాయింట్. దీంతో జనసేన క్యాడర్ మొత్తం కందుల దుర్గేష్ కోసం ఎక్కడైనా పనిచేస్తాం గెలిపించుకుంటాం అన్న నినాదంతో ముందుకు సాగుతున్నాయి.

ఇక రెండు పార్టీల క్యాడర్ గ్రౌండ్ లెవెల్ లో పాలూ నీళ్ళల్లా కలసి పోవడం కూడా శుభ పరిణామంగా చూస్తున్నారు. అదే విధంగా పెద్దాయన గోరంట్ల కోసం దుర్గేష్ సీటు త్యాగం చేసిన తీరు పట్ల కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది ఆయనకు నిడదవోలులో సైతం విజయావకాశాలను రెట్టింపు చేసేదిగా ఉంది అని అంటున్నారు.

అదే విధంగా అటు పవన్ కి అత్యంత సన్నిహితుడిగా దుర్గేష్ ఉన్నారు. ఇపుడు సీట్ల సర్దుబాటు ఎపిసోడ్ లో దుర్గేష్ చూపించిన పరిణతితో చంద్రబాబు దృష్టిలో కూడా ఆయన మంచి లీడర్ గా నిలిచిపోయారని, అలా దుర్గేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇవన్నీ అత్యంత కీలకంగా మారి మేలు చేసే విధంగా ఉండబోతున్నాయని అంటున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే నేతగా నిడదవోలుకు వెళ్తున్న దుర్గేష్ ఎమ్మెల్యే కావడమే కాదు మినిస్టర్ కూడా కాబోతున్నారు అన్నది రెండు పార్టీలలో ఘంటాపధంగా వినిపిస్తున్న మాటగా ఉంది.