Begin typing your search above and press return to search.

రేవంత్ అంకుల్.. దసరా సెలవులు తగ్గాయ్.. పిల్లలు, యువత నిరాశ

అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:30 PM GMT
రేవంత్ అంకుల్.. దసరా సెలవులు తగ్గాయ్.. పిల్లలు, యువత నిరాశ
X

దసరా.. తెలంగాణలో అతిపెద్ద పండుగ. బతుకమ్మతో మొదలై.. విజయదశమితో ముగుస్తాయి. బతుకమ్మ సంబరాలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. వేడుకల్లో ఒక్క రోజు మినహా ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంతటి ప్రాశస్యం బతుకమ్మ-దసరాకు ఉంది. ఇక దసరా రోజు సందడే సందడి. ఊరు ఊరంతా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి.. పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. జమ్మిని ఇంటికి తీసుకొచ్చి పెద్దలకు, స్నేహితులకు ఇస్తారు. దేవుడి దగ్గర కూడా పెడతారు. అలయ్ బలయ్ చేసుకుంటారు. ఓ విధంగా చెప్పాలంటే 15 రోజుల పాటు తెలంగాణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

తెలంగాణ రాకతో మహర్దశ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వేరే సంగతి. దసరా, సంక్రాతి రెండూ తెలుగు పండుగలను సమానంగా చూడాల్సిన పరిస్థితి. అప్పటికీ సంక్రాతికే కాస్త మొగ్గు కనిపించేది. తెలంగాణ ఏర్పాటయ్యాక మాత్రం పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే బతుకమ్మ-దసరాకు విశేష గుర్తింపు దక్కింది. అందులోనూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఈ రెండు పండుగలకు అద్భుతమైన ఆదరణ కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులే నేరుగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటూ మరింత ఆడంబరం తెచ్చారు. దీనికితగ్గట్లే కేసీఆర్ సర్కారు నిరుటి వరకు దసరా సెలవులను భారీగా ఇచ్చింది. తెలంగాణ వచ్చిన కొత్తలో దాదాపు రెండు వారాలు దసరా సెలవులు ఇచ్చారు.

ఈసారి తగ్గాయి సారూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి దసరా పండుగ వస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సెలవుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 13 రోజులే. ఒకటి తగ్గినా.. కేసీఆర్ సర్కారు రెండు వారాలు అంతకుమించి సెలవులు ఇచ్చింది. అయితే, రేవంత్ ప్రభుత్వం దసరా సెలవులుగా 13 రోజులు ఇచ్చింది. ఇందులో గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2ను తీసివేయాల్సి ఉంటుంది. నికరంగా 12 రోజులే దసరా సెలవులు అన్నమాట.

పైగా ఈసారి దసరా శనివారం వచ్చింది. ఇప్పటివరకైతే మార్పు లేదు. అంటే శనివారమే పండుగ జరుపుకొంటారు. ఆదివారమే కక్కా ముక్కా దసరా అంటేనే తెలంగాణ భాషలో చెప్పాలంటే కక్కా ముక్కా. కానీ ఈసారి శనివారం రావడంతో కక్కాముక్కకు కాస్త సందేహించాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు దసరా ఆదివారమే అనుకోవాలి. ఏదైనా మారి.. ఆదివారం అధికారికంగా ప్రకటిస్తే తప్ప. ఆ వెంటనే సోమవారం మాత్రమే సెలవు ఉంది. మంగళవారం (అక్టోబరు 15) నుంచి పిల్లలు, యువకులు కాలేజీలకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.

రేవంత్ అంకుల్ సెలవులు తగ్గాయ్.. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాస్త స్వేచ్ఛగా దసరా సెలవులు ఇస్తుందని ఆశించిన విద్యార్థలు, యువత ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. అమ్మమ్మల ఇళ్లకు వెళ్లి ఆడుకోవాలని ఉత్సాహపడే మరీ చిన్న పిల్లలైతే మొహం దిగాలుగా పెట్టేస్తున్నారు. మరి రేవంత్ అంకుల్ వారికి ఏం సముదాయిస్తారో చూడాలి.