ఇక దువ్వాడ వంతు.. నోటి దురుసుపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 3:15 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దువ్వాడ మాదిరిగానే సినీ నటుడు పోసానిపై ఇప్పటికే 14 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో వరుసగా పోసానిని అరెస్టు చేస్తుండగా, ఇప్పుడు జనసైనికులు దువ్వాడను టార్గెట్ చేశారని చెబుతున్నారు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వం తమదేనన్న ధీమాతో ఇష్టానుసారం మాట్లాడిన వారు తప్పైపోయిందని ఇప్పుడు నెత్తీనోరు మొత్తుకున్నా ప్రభుత్వం వదలడం లేదు. సినీనటుడు పోసాని క్రిష్ణమురళి ఇదేవిధంగా వ్యవహరించారు. అప్పట్లో తెలిసి తెలియక మాట్లాడేశానని, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని తనను వదిలేయండని వేడుకున్నా ప్రభుత్వం మాత్రం క్షమించలేదు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. పోసాని ఎపిసోడ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం మరో వైసీపీ నేతను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసుస్టేషన్ తోపాటు మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇక గతంలో కూడా ఆయనపై జనసేన, టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీ వార్ తో వార్తల్లో ఎక్కిన దువ్వాడ.. ప్రస్తుతం కుటుంబంలో ఒంటరి అయ్యారు. ఇక ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జిగా కూడా పార్టీ తప్పించింది. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పార్టీ మద్దతు లభిస్తుందా? లేదా? అనేది కూడా చర్చకు తావిస్తోంది.