వైరల్ వీడియో : అర్థరాత్రి భార్య.. కుమార్తెపై దువ్వాడ దాడికి యత్నం!
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వెళ్లారు.
By: Tupaki Desk | 10 Aug 2024 3:59 AM GMTరెండు.. మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారి.. ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఎపిసోడ్. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని.. తనను.. తన పిల్లల్ని ఇంట్లోకి రానివ్వటం లేదంటూ దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇంటి ముందుకు రావటం.. లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. సిబ్బంది అడ్డుకోవటంపై ఆమె మండిపడ్డారు. తన ఇంట్లోకి తనను ఎందుకు వెళ్లనివ్వరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయటంతో హైడ్రామా వ్యక్తమైంది.
తనను.. తన పిల్లల సంగతేమిటంటూ ప్రశ్నిస్తున్న ఆమె మాటలు మీడియాలో హైలెట్ అయ్యాయి. గడిచిన రెండు రోజులుగా సాగుతున్న నాటకీయ పరిణామాలు ఒక ఎత్తు కాగా.. శుక్రవారం అర్థరాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళానికి వచ్చిన మాధురి మీడియాతో మాట్లాడటం.. ఈ సందర్భంగా తాను.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇద్దరూ స్నేహితులమని.. తమ మధ్య ఉన్నది స్నేహబంధమే అని చెప్పిన ఆమె.. తామిద్దరం కలిసే ఉన్నామని.. కలిసే గుళ్లకు వెళతామని చెప్పటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వెళ్లారు. తల్లీకూతుళ్లు ఇంటి లోపలకు వెళ్లిన సమాచారం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సోదరుడు శ్రీధర్ లు తమ అనుచరులతో ఇంటి వద్దకు చేరుకున్నారు. వరుస పెట్టి చోటు చేసుకున్న పరిణామాల గురించి సమాచారం తెలుసుకున్న టెక్కలి సీఐ పైడయ్య.. తన సిబ్బందితో పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్నారు.
తన సోదరుడితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. వచ్చీ రావటంతోనే బూతుపురాణం అందుకున్నారు. భార్యపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తిట్లు.. బండ బూతులతో మండిపడుతూ.. ఇంటి నిర్మాణానికి వినియోగించే గ్రానైట్ రాడ్ ను తీసుకొని ఆమెపై దాడికి యత్నిస్తూ ఒక్క ఉదుటన దూసుకెళ్లారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు.. ఎమ్మెల్సీశ్రీనివాస్ ను.. ఆయన సోదరుడ్ని పోలీసులు నిలువరించారు. ఇదే సమయంలో శ్రీనివాస్..ఆయన సోదరుడు శ్రీధర్ పైన దువ్వాడ సతీమణి వాణి.. కుమార్తె హైందవి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా శ్రీనివాస్ దూషణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. లెక్క తేలే వరకు తాము అక్కడే ఉంటామంటూ తల్లి.. కుమార్తెలు బైఠాయించారు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.