"తన విచిత్రమైన కథకు విడాకులే ముగింపు!"... దువ్వాడ కీలక వ్యాఖ్యలు!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Aug 2024 7:27 AM GMTవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలోని శ్రీనివాస్ ఇంటికి పెద్దకుమార్తె హైందవితో వాణి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఇంటిగేట్లు తెరుచుకోకపోవడంతో.. క్యాపు కార్యాలయం డోర్లను కట్టర్లతో కట్ చేశారు వాణి & కో!
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తన భార్య, కుమార్తె తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో దువ్వాడ, అతని సతీమణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ వాణి పట్టుబట్టింది. అయితే... ఆ కార్యాలయం కట్టించింది దానంటూ శ్రీనివాస్ తమ్ముడు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కల్పించుకున్న పోలీసులు.. ఇరువర్గాలకూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో... క్యాంపు కార్యాలయం ఖాళీ చేసేవరకూ తాను ఇక్కడే ఉంటానంటూ ఆమె ఆ ఆఫీసు బయటే నిద్రించారు. ఈ సందర్భంగా అసలు ఏ హక్కుతో మాధురి తన భర్తతో ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
ఈ సమయంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి అనే మహిళ కలిసి ఉంటుందని, ఆమె దువ్వాడను ట్రప్ చేసిందని ఆయన భార్య వాణి, కుమార్తెలు ఆరోపిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా శ్రీనివాస్ స్పందించారు. అసలు తనవద్ద ఏమి ఉందని మాధురి తనను ట్రాప్ చేస్తుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. తన వద్ద ఉన్న ఆస్తులు, ఫ్యాక్టరీలు ఇప్పటికే భార్య పిల్లలకు రాసినట్లు ఆయన తెలిపారు.
ఇదే క్రమంలో సుమారు 6 కోట్ల రూపాయలతో కట్టిన ఇంటిని భార్య పిల్లాలకే రాసిచ్చినట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది కాలంలొనే సుమారు ఒక కోటీ ఏభై లక్షలు నగదు రూపంలో ఇచ్చినట్లు చెప్పిన శ్రీనివాస్, వాటికి సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ పెట్టి అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తనది ఓ ప్రత్యేకమైన కథ అని.. ఈ కథకి ముగింపు విడాకులే అని స్పష్టం చేశారు.