Begin typing your search above and press return to search.

ఎన్నికలకు ముందు పలాస.. అయ్యాక అక్కవరం.. దువ్వాడపై భార్య ఫైర్!

ఇందులో భాగంగా... వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు.. నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కూడా రోడ్డున పడిందని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 6:39 AM GMT
ఎన్నికలకు ముందు పలాస.. అయ్యాక అక్కవరం.. దువ్వాడపై  భార్య ఫైర్!
X

గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఆయన మరో స్త్రీతో ఉంటున్నారని శ్రీనివాస్ భార్య, పిల్లలు అరోపిస్తున్నా పరిస్థితి. తమ తండ్రితో టచ్ లోకి వెళ్లాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్పందించడం లేదని ఆయన కుమర్తెలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవహారం పీక్స్ కి చేరినట్లుగా తెలుస్తోంది.

మరోపక్క శ్రీనివాస్ కు తనకు మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మరేమీ కాదని టెక్కలి వైసీపీ నాయకురాలు మాధురి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. తన భర్త మెరైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారని.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుకు లాగడం సరికాదని.. వాళ్లకు వాళ్లకు మధ్య ఏమైనా ఉంటే వారే తేల్చుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రాజకీయాల్లో అన్నింటితో పాటు కుటుంబాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... రెండేళ్లుగా తాము విడిగానే ఉంటున్నామని స్పష్టం చేశారు. అసలు తన ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన వారు తన భార్య, పిల్లలే కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా... తాను ఏ జన్మలో చేసిన పాపమో ఆమెతో వివాహం అని, ఫలితంగా సుమారు 30 ఏళ్లుగా నరకం చూపించిందని తెలిపారు. ఇప్పుడిప్పుడే తాను సంతోషంగా ఉంటున్న సమయంలో... రౌడీ మూకలతో దాడి చేయడానికి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆమె నుంచి తనను రక్షించాలంటూ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, కుమార్తెలు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు.. నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, పార్టీ కూడా రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఆమెతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకు తన కుమార్తెలు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ వేచి ఉన్నా తలుపు తీయకుండా, లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు!