Begin typing your search above and press return to search.

హోంగార్డు ఉద్యోగాలంటూ డీజీపీ పేరుతోనే నకిలీ నోటిఫికేషన్

వారి పేరు వీరి పేరు చెప్పి మోసం చేస్తే కిక్కు ఏముంది అనుకున్నాడేమో.. తన మాయలకు ఏకంగా పోలీసు పెద్దాయన పేరే వాడుకున్నాడు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 10:56 AM GMT
హోంగార్డు ఉద్యోగాలంటూ డీజీపీ పేరుతోనే నకిలీ నోటిఫికేషన్
X

మోసగాళ్లు ఎంతకైనా తెగిస్తారనేందుకు ఈ వ్యవహారమే ఒక నిదర్శనం. వారి పేరు వీరి పేరు చెప్పి మోసం చేస్తే కిక్కు ఏముంది అనుకున్నాడేమో.. తన మాయలకు ఏకంగా పోలీసు పెద్దాయన పేరే వాడుకున్నాడు. హోంగార్డు ఉద్యోగాలంటూ ప్రత్యేకంగా నోటిఫికేన్ ఇచ్చి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశాడు. ఈ నకిలీ బాగోతం డీజీపీ దృష్టికి వెళ్లడంతో మోసగాడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

ఏపీ పోలీసుశాఖలో హోంగార్డు పోస్టులకు ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ, పోలీసు శాఖలో సంగీతం బ్యాండ్ వాయించేందుకు హోంగార్డులు కావాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరుతో ఓ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం, పోలీసు హెడ్ క్వార్టర్సు, విజయవాడ పేరుతో ఒక లెటర్ సృష్టించిన మోసగాడు జనవరి 10న ప్లేస్మెంట్ ఏజెన్సీ నిర్వాహకుడు పి.శివ ద్వారా నియామకాలు చేస్తామని ప్రకటన జారీ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వరకు విషయం చేరింది.

మోసగాడు ఏకంగా తన పేరునే వాడుకోవడంతో కంగుతిన్న డీజీపీ లెటర్ ఎవరు సృష్టించారో వెంటనే తెలుసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఈ లెటరును ఎవరూ సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని, ఎవరైనా ఎవరికి ఫార్వర్డ్ చేసిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వారి తాట తీయాలని ఆదేశించారు.

ఇప్పటికే ఉద్యోగాల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్యే శ్రీకాకుళంలో ఆర్మీ కాలింగ్ అనే సంస్థ ద్వారా దాని నిర్వాహకుడు లక్షల్లో నిరుద్యోగుల నుంచి వసూలు చేసి మోసం చేశాడు. ఈ మోసం వెలుగు చూసిన కొద్ది రోజులుకే గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా డీజీపీ పేరుతోనే ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల వేయడం పట్ల పోలీసు శాఖ సీరియస్ అవుతోంది. ముఖ్యంగా ఈ తరహా నేరాలను అదుపు చేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.