Begin typing your search above and press return to search.

టీడీపీలోకి విజయసాయిరెడ్డి బావమరిది!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 9:14 AM GMT
టీడీపీలోకి విజయసాయిరెడ్డి బావమరిది!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతున్నారు. 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు ఇప్పటికే కొత్త అభ్యర్థులను ప్రకటించారు. పలువురిని ఒక చోట నుంచి ఇంకో చోటకు జంబ్లింగ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో సీట్లు దక్కనివారు, ఇక తమకు సీట్లు దక్కవని నిర్ధారణకొస్తున్నవారు వేరే పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి బావమరిది, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌ రెడ్డి సైతం వైసీపీకి వీడ్కోలు పలుకుతున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ద్వారకానాథ్‌ రెడ్డి జనవరి 3న టీడీపీలో చేరనున్నారు.

విజయసాయిరెడ్డికి ద్వారకానాథ్‌ రెడ్డి స్వయానా బావమరిది. ఈయన అక్కనే విజయసాయిరెడ్డి పెళ్లి చేసుకున్నారు. 1994లో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ ఆయనకు సీటు ఇవ్వలేదు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నించినా టికెట్‌ రాలేదు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు.

ద్వారకానాథ్‌ రెడ్డి 2009లో సైతం టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీంతో వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పార్టీలో చేరి టికెట్‌ ను ఆశించారు. అయినప్పటికీ జగన్‌ టికెట్‌ ఇవ్వలేదు. గత 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ, తెలుగుదేశం పార్టీల తరఫున టికెట్‌ ను ఆశించినా ప్రయోజనం లభించలేదు. ఇక అప్పటి నుంచి ద్వారకానాథ్‌ రెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబను కలిసి పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ద్వారకానాథ్‌ రెడ్డి రాయచోటి టీడీపీ టికెట్‌ ను ఆశిస్తున్నారు. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి, అక్క హరెమ్మ (నందమూరి తారకరత్నకు స్వయానా అత్త) కూడా టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఉన్నారు.

కాగా ద్వారకానాథరెడ్డి కుటుంబం 1962 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే రాయచోటి ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ తరఫున ముగ్గురు నాయకులు ఆశిస్తుండగా ద్వారకానాథరెడ్డి కూడా దాన్నే ఆశిస్తున్నారు.