అప్పుడే ఎండలు.. మంట పుట్టిస్తున్న సూరీడు
అందుకు భిన్నంగా జనవరి చివరి నుంచే భానుడి భగభగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
By: Tupaki Desk | 2 Feb 2025 6:30 AMచలికాలం తరవాత ఎండా కాలం మామూలే. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలం పూర్తిగా కాకుండానే ఎండాకాలం ఎంట్రీ ఇచ్చేసిందా? అన్నట్లుగా ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఎండా కాలం మొదలైన కొద్ది రోజులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా జనవరి చివరి నుంచే భానుడి భగభగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఫిబ్రవరి మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉస్షోగ్రతలు నమోదయ్యాయి. శనివారం హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు ఉండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం వేళలో పొగ మంచు దట్టంగా కమ్మేస్తున్నా.. పది గంటల తర్వాత నుంచి ఎండలు మండుతున్నాయి. సరాసరిన గరిష్ఠ.. కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో ఉక్కపోతతో పాటు.. ఎండాకాలం అప్పుడే వచ్చేసిందన్న భావన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎండాకాలం శివరాత్రి రోజు నుంచి మొదలవుతాయన్న సంగతి తెలిసిందే. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఎండాకాలాన్ని మరింత త్వరగా వచ్చేలా చేశాయని చెప్పాలి. జనవరి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిన వేళ.. వేసవి కాలంలో కీలకమైన మార్చి.. ఏప్రిల్.. మే నెలల సంగతేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం ఉపరితల గాలులు దక్షిణ.. ఆగ్నేయ దిశగా గంటకు నాలుగు కి.మీ. వేగంతో వీస్తున్నాయని.. మరో రెండు మూడు రోజుల పాటు గరిష్ఠ.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎంట్రీలోనే ఇంత ఎండలంటే.. ఈ వేసవి మహా హాట్ అని అనుకోవాలేమో?