కేంద్రం ముందస్తుకు వెళుతుందా ?
ఇంతకాలం జమిలి ఎన్నికల జపం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు ముందస్తు సంకేతాలను ఇస్తోందా ?
By: Tupaki Desk | 18 Aug 2023 3:30 PM GMTఇంతకాలం జమిలి ఎన్నికల జపం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు ముందస్తు సంకేతాలను ఇస్తోందా ? అవుననే అంటున్నారు అందరు. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని నరేంద్ర మోడీ చాలా ఆశపడ్డారు. ఇపుడు ఎన్నికలు జరుగుతున్న విధానం వల్ల బీజేపీకి నష్టం వస్తోందని మోడీ భావన. పార్లమెంట్, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్న కారణంగానే చాలా రాష్ట్రాల్లో జనాలు బీజేపీకి ఓట్లేయటం లేదని మోడీ అనుకుంటున్నారు.
అదే పార్లమెంటు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఓటర్లు రెండు ఓట్లను బీజేపీకే వేస్తారని మోడీ అంచనాలు వేసుకున్నారు. అయితే ఆలోచనంత లేలికకాదు జమిలి ఎన్నికల నిర్వహణ అని అర్ధమైంది. అందుకనే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేలిపోయింది. మరిపుడు ప్రత్యామ్నాయం ఏమిటి ? అని ఆలోచించిన మోడీకి ముందస్తు ఎన్నికలే మార్గమని అర్ధమైందని ఢిల్లీ వర్గాల సమాచారం. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్-మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సుంది.
అయితే ఓ నాలుగు నెలల ముందే ఎన్నికలు జరిపేస్తే ఎలాగుంటుందని మోడీ ఆలోచిస్తున్నారట. ఏప్రిల్-మే నెలలంటే ఎండలు మండిపోయే కాలం. అదే నాలుగు మాసాల ముందుంటే జనవరి అవుతుంది. ప్రచారం చేసుకునేందుకు జనవరి నెల ఆహ్లాదంగానే ఉంటుంది. పైగా ఈ ఏడాది చివరి, వచ్చే ఏడాది మొదట్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంటు ఎన్నికలు కూడా జరిపేయచ్చని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. షెడ్యూల్ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఐదురాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్ గా ప్రచారం జరుగుతోంది. ప్రీపోల్ సర్వేల ప్రకారం చూస్తే చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ లో బీజేపీకి అధికారం దక్కేది కష్టమే. ఇక తెలంగాణాలో అయితే అవకాశమే లేదు. ఇక మిజోరం చాలా చిన్న రాష్ట్రం కాబట్టి పెద్దగా పట్టిచుకోవటంలేదు.
ప్రీ పోల్ సర్వే ప్రకారమే బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికలపైన కూడా పడుతుందని మోడీ ఆలోచిస్తున్నారట. అందుకనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ను ముందుకు జరిపేస్తే కనీసం ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిసి జరిగిపోతాయని మోడీ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయమై తొందరలోనే ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం పెట్టబోతున్నారట. మరి ఏమి జరగబోతోందో చూడాలి.