భూమికి బుల్లి జాబిలి దర్శనం... ఎప్పుడు, ఎలా..?
భూమికి రెండో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది.. అది ఆకాశంలో అందంగా దర్శనమిస్తే ఇంకెలా ఉంటుంది..
By: Tupaki Desk | 28 Sep 2024 5:30 PM GMTభూమికి రెండో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది.. అది ఆకాశంలో అందంగా దర్శనమిస్తే ఇంకెలా ఉంటుంది.. అది చూసే అవకాశం లభిస్తే ఇంకెంత బాగుటుంది.. ఇవన్నీ సాధ్యమయ్యే సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. శాస్త్రవేత్తలు దీనిపై ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అవును... భూమికి రెండో చంద్రుడు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. 2024 పీటీ5 అనే గ్రహ శకలం భూమి గురుత్వాకర్షణకు లోబడి జాబిల్లిగా మారనుంది. సెప్టెంబర్ 29 (ఆదివారం) నుంచి నవంబర్ 25 వరకూ ఈ గ్రహశకలం భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే చిన్న కండిషన్!
ఇలా భూమికి రెండో చంద్రుడు కనిపించే అరుదైన ఘట్టం ఈ నెల 29 నుంచి మొదలుకాబోతోంది. కాకపోతే కొన్ని రోజులు మాత్రమే. సెప్టెంబర్ 25 తర్వాత ఈ బుల్లి జాబిల్లి భూగురుత్వాకర్షణ నుంచి విడిపోనుంది. అనంతరం అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. ఈలోపు చూడాలంటే ఒకటే అవకాశం ఉందని అంటున్నారు.
సుమారు 33 అడుగుల పొడవు, 138 అడుగులవరకూ వెడల్పు ఉండే ఈ గ్రహశకలాన్ని మన కళ్లతో మాత్రం నేరుగా చూడలేము. అలా అని చిన్న చిన్న టెలీస్కోప్స్ తోనూ సాధ్యం కాదు. ఎందుకంటే... ఇది చాలా ఎత్తులో ఉండటంతో పాటు చిన్నగా కూడా ఉంటుంది.
నాసా సాయంతో నిర్వహిస్తున్న ఆస్ట్రాయిడ్ టెరిస్త్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలార్ట్ సిస్టమ్ సాయంతో దీన్ని ఈ ఏడాది ఆగస్తులో గుర్తించారు. ఈ సందర్భంగా స్పందించిన నాసా... ఏదో ఒక అంతరిక్ష వస్తువు ఢీకొనప్పుడు చంద్రుడి నుంచి విడిపోయిన ముక్కలా కనిపిస్తుందని అంటున్నారు. అంటే... ఇది చంద్రుడిలో చిన్న ముక్క అన్నమాట!
మరి ఈ చిన్న జాబిల్లిని చూడటానికి ఈ నెల 29 నుంచి నవంబర్ 25 వరకూ మాత్రమే అవకాశం ఉందని చెబుతున్నారు కాబట్టి... ఈ లోపు ఆ బుల్లి జాబిల్లిని చూసెయ్యాలన్నమాట.