అమెరికాలో భూకంపం.. ఎక్కడ? తీవ్రత ఎంత?
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.44 గంటల వేళలో భారీ భూకంపం సంభవించింది.
By: Tupaki Desk | 6 Dec 2024 5:35 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.44 గంటల వేళలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 7కు పైనే నమోదైంది. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వర్గాలు వెల్లడించాయి. భూకంప కేంద్రం ఉత్తర కాలిఫోర్నియాలోని ఒరెగాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫెర్న్ డేల్ అనే చిన్న పట్టణంగా చెబుతున్నారు.
భూకంపం నేపథ్యంలో జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.తాజా భూకంపం కారణంగా పెట్రోలియా.. స్కాటియా.. కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు నమోదైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ భూకంపం కారణంగా ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది? ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కాలేదు. ఉత్తర కాలిఫోర్నియాలో సంభవించిన భూకంప తీవ్రత శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
భూప్రకంపనల సమయంలో ఒక్కసారి షేక్ అయ్యామని బాధితులు చెబుతున్నారు. భూకంపం చోటు చేసుకున్న కాసేపటికే సునామీ హెచ్చరికల్ని జారీ చేసిన అధికారులు.. కాసేపటికి వాటిని ఉపసంహరించుకున్నారు. సునామీ హెచ్చరికల కారణంగా 53 లక్షల మంది ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూప్రకంపనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో సుమారు 13 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంపం కారణంగా శాంటాక్రజ్ ప్రాంతంలో నేషనల్ వెదర్ సర్వీస్ తీర ప్రాంతాలను బలమైన అలలు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న సూచనలు చేస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్తల్లో భాగంగా నీటి అడుగున సొరంగం నుంచి వాహన రాకపోకల్ని నిలిపేశారు. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికతోనే భూకంపానికి కారణంగా చెబుతున్నారు. ఈ పలకలు ఒకదానితో మరొకటి ఢీ కొన్నప్పుడు లేదంటే రాపిడి జరిగినప్పుడు భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రతను ఒక నుంచి తొమ్మిది అంకె వరకు లెక్కిస్తారు. తాజా భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7గా నమోదు కావటంతో.. భూకంపం సంబంధించిన కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో భూమి తీవ్రమైన ప్రకంపనలకు కారణమవుతుందని భావిస్తున్నారు.