Begin typing your search above and press return to search.

వరంగల్‌ లో భూకంపం... కొత్తగూడెంలో టెన్షన్!

వరంగల్‌ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 7:42 AM GMT
వరంగల్‌  లో భూకంపం... కొత్తగూడెంలో  టెన్షన్!
X

భూకంపం అంటే ప్రజలు వణికిపోతారు. మరి ముఖ్యంగా భారీ భవంతులు ఉండే ప్రాంతాల్లో అయితే ఈ టెన్షన్ డబుల్ అవుతుందని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భూమీ కంపించింది. దీంతో... ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


అవును... తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్‌ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలుచోట్ల ఇళ్లలోని వస్తువులు కదిలాయి.

ఈ విషయాలపై జాతీయ భూకంప అధ్యయన విభాగం స్పందించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదైనట్లు వెల్లడించింది. వరంగల్‌ కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో.. 30 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. ఇది సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర సంభవించినట్లు చెబుతున్నారు.

ఇలా శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలతో వరంగల్ వాసులు వణికిపోయారు. ఈ సమయంలో కొంతమంది నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేవగా... మెలుకువగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో వెంటనే ఊపిరిపీల్చుకున్నారు.

కాగా... మణుగూరులో ఈనెల 19న కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.