తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. హైదరాబాద్ లో ఎక్కడెక్కడంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. ఏపీలోనూ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
By: Tupaki Desk | 4 Dec 2024 4:41 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. ఏపీలోనూ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇందులో భాగంగా... మణుగూరు, భద్రాచలం, చర్ల, కొత్తగూడెం, నాగులవంచ మండలాల్లో భూమి కంపించింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది.
అవును... తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇదే సమయంలో... జగ్గయ్యపేట టౌన్, పరిసర గ్రామాల్లోనూ భూప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో... అపార్ట్మెంట్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు.
ఇదే సమయంలో... నందిగామ, విశాఖ-అక్కయ్యపాలెం, తిరువూరు, గంపలగూడెంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ములుగు కేంద్రంగా బుధవారం ఉదయం 7:27 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రంగా నమోదైంది. వాకింగ్ కి వెళ్తున్నవారు ఈ భూకంప తీవ్రతను స్పష్టంగా ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.
అదేవిధంగా... హైదరాబాద్ లోని బోరబండ, కార్మికనగర్, యూసఫ్ గుడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ 2 నుంచి 3 సెకన్ల పాటు భూమికంపించినట్లు చెబుతున్నారు. దీనిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది.
కాగా... ఈ ఏడాది మార్చి 14న ఏపీలో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఇది రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని నాడు వెల్లడించింది. ఈ క్రమంలో... తాజాగా నేడు మరోసారి భూమి కంపించింది.